Atmakur Bypoll : ప్రశాంతంగా ముగిసిన ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్

By Siva KodatiFirst Published Jun 23, 2022, 7:51 PM IST
Highlights

ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 14 మంది బరిలో వున్నారని.. 6 గంటల వరకు క్యూలైన్‌లో వున్న వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తామని ఆయన చెప్పారు. 

ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ (atmakur bypoll) ప్రశాంతంగా ముగిసింది. దీనికి సంబంధించి ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా (mukesh kumar meena) మీడియాతో మాట్లాడారు. 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని.. ఏడు చోట్ల ఈవీఎంలు, ఒక చోట వీవీ ప్యాడ్‌లలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని ముఖేష్ తెలిపారు. సమస్యను పరిష్కారం చేసి సజావుగా ఎన్నికలు నిర్వహించారని ఆయన వెల్లడించారు. 7 గంటల ప్రాంతంలో పూర్తి స్థాయిలో పోలింగ్ పూర్తి కావచ్చని సీఈవో తెలిపారు. 

పరిస్థితిని బట్టి 70 శాతం దాకా పోలింగ్ నమోదు కావొచ్చని , గత ఎన్నికల్లో 82 శాతం పోలింగ్ జరిగిందని ఆయన గుర్తుచేశారు. ఉప ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గుతుందని ముఖేష్ పేర్కొన్నారు. కొన్ని చోట్ల వైఎస్ఆర్ , బీజేపీ కార్యకర్తల మధ్య చిన్న వాగ్వివాదాలు జరిగాయని ఆయన చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయని సీఈవో వెల్లడించారు. ప్రశాంతంగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించినందుకు సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. 

131 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ క్యాంలు, మైక్రో అబ్జర్వర్‌లను ఏర్పాటు చేసి ఎలాంటి అక్రమాలు జరుగకుండా పోలింగ్ నిర్వహించామన్నారు. 1,339 మంది పోలింగ్ సిబ్బంది, 1,100 మంది పోలీస్ సిబ్బంది, మూడు కంపెనీల కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించామని ముఖేష్ మీనా తెలిపారు. 38 ఫిర్యాదులు వచ్చాయని... అన్నింటినీ పరిష్కరించామని ఆయన వెల్లడించారు. ఈవీఎంలు, వీవీప్యాడ్‌లను ఆత్మకూరు ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజిలోని స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచి, గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని ముఖేష్ మీనా తెలిపారు. 
 

click me!