విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనకు కారణమైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిగరేట్ తాగి బోటుపై పడేయడం వల్లే ప్రమాదం జరిగిందని, ప్రమాదానికి వాసుపల్లి నాని, అతని మామ సత్యం కారణమని సీపీ వెల్లడించారు. విచారణలో భాగంగానే యూట్యూబర్ నానిని ప్రశ్నించామని సీపీ పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనకు కారణమైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు విశాఖ నగర పోలీస్ కమీషనర్ రవిశంకర్ శనివారం మీడియాకు వివరాలు తెలియజేశారు. సిగరేట్ తాగి బోటుపై పడేయడం వల్లే ప్రమాదం జరిగిందని, ప్రమాదానికి వాసుపల్లి నాని, అతని మామ సత్యం కారణమని సీపీ వెల్లడించారు. వెంకటేశ్‌కు చెందిన బోటులో మద్యం తాగి ఫిష్ ఫ్రైతో పార్టీ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
తర్వాత సిగరేట్ తాగి పక్కనే వున్న 815 నెం. బోటుపై పడేశారని.. కాలిన సిగరెట్ వలలపై పడటంతో మొదట పొగలు వచ్చాయని సీపీ చెప్పారు. బలమైన గాలులు వీయడంతో మంటలు వ్యాపించాయని, ఆపై మెల్లగా బోట్లకు మంటలు అంటుకున్నాయని కమీషనర్ వెల్లడించారు. మంటలు రావడంతో అక్కడి నుంచి జారుకున్నారని.. బోట్లలో వాసుపల్లి నాని కుక్‌గా, సత్యం వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారని సీపీ పేర్కొన్నారు.
Also Read: Vizag Fishing Harbour Fire : మంట పెట్టింది ఉప్పుచేపా? సీసీ టీవీలో వెలుగు చూసిన మనుషులా? (వీడియో)
ప్రమాదానికి కారణమైన వాసుపల్లి నాని, సత్యంపై కేసులు నమోదు చేశామని సీపీ వెల్లడించారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించారని.. ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా, 18 పాక్షికంగా దగ్ధమయ్యాయని కమీషనర్ రవిశంకర్ తెలిపారు. ఫిషింగ్ హార్భర్‌లో అగ్నిప్రమాదంతో రూ.8 కోట్ల నష్టం వాటిల్లిందని.. విచారణలో భాగంగానే యూట్యూబర్ నానిని ప్రశ్నించామని సీపీ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో యూట్యూబర్ నాని ప్రమేయం లేదని విడిచిపెట్టామని, కానీ ఈ లోపే అతను హైకోర్టును ఆశ్రయించాడని కమీషనర్ రవిశంకర్ చెప్పారు.