పర్మిషన్ వున్నా ఫైన్ వేస్తారా.. విశాఖలో యువతి హల్‌చల్‌, అసలు కథ ఇదీ

By Siva Kodati  |  First Published Jun 6, 2021, 5:39 PM IST

విశాఖలో ఓ ఆసుపత్రి మహిళా ఉద్యోగి, పోలీసుల మధ్య గొడవపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. కర్ఫ్యూ సమయంలో బయటకు తిరిగేందుకు అనుమతి వున్నా తనకు జరిమానా విధించారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 


విశాఖలో ఓ ఆసుపత్రి మహిళా ఉద్యోగి, పోలీసుల మధ్య గొడవపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. కర్ఫ్యూ సమయంలో బయటకు తిరిగేందుకు అనుమతి వున్నా తనకు జరిమానా విధించారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు రోడ్డుపై న్యూసెన్స్ చేసినందుకు గాను సదరు యువతిని స్టేషన్‌కు తరలించాలని ఖాకీలు యత్నించారు. దీనిని ఆమె తీవ్ర స్థాయిలో ప్రతిఘటించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదే సమయంలో సదరు యువతి లక్ష్మీ అపర్ణ, ఆమె స్నేహితుడిపై సెక్షన్ 352, 353ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో పోలీసులు ఆదివారం వివరణ ఇచ్చారు. నిబంధనల ప్రకారమే వ్యవహరించామంటూ విశాఖ పోలీసులు వెల్లడించారు. కావాలనే యువతి నానా రచ్చ చేసిందని పోలీసులు ఆరోపించారు. అయితే పాస్ వున్నా.. పోలీసులు ఫైన్ విధించారని యువతి ఆరోపించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు లేవని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. విధులు సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ కొందరి వల్ల తాము మాట పడాల్సి వస్తోందని మహిళా కానిస్టేబుల్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. 

Latest Videos

undefined

Also Read:పోలీసులనే ఎదిరించి... నడిరోడ్డుపై పడుకుని యువతి హల్చల్

వివరాల్లోకి వెళితే... విశాఖపట్నంలోని ఓ అపోలో ఫార్మసీలో అపర్ణ అనే మహిళ పనిచేస్తోంది. అత్యవసర సర్వీస్ కావడంతో ఆమె కర్ప్యూ సమయంలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరింది. ఆమె రోడ్డుపై వెళుతుండగా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైన్ వేశాడు. దీంతో పోలీస్ అధికారులు అపర్ణ వాగ్వాదానికి దిగింది. తనకు అన్ని అనుమతులు వున్నా ఎలా ఫైన్ వేస్తారంటూ నిలదీసింది. 

ఈ క్రమంలో పోలీసులకు, యువతికి మధ్య వాగ్వాదం కాస్తా తోపులాటకు దారితీసింది. ఆమె వద్ద గల ద్విచక్ర వాహనాన్ని స్వాదీనం చేసుకోడానికి ప్రయత్నించగా యువతి అడ్డుకుంది. దీంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకోడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహిళా పోలీసులు, యువతికి మద్య తోపులాట చోటుచేసుకుంది. తాను తప్పు చేయనప్పుడు ఎందుకు రావాలంటూ ఆమె నేలపై పడుకుని నిరసనకు దిగింది. స్టేషన్‌కు రానని యువతి తేల్చిచెప్పడంతో చివరకు పోలీసులు వెనుదిరిగారు. 

click me!