విశాఖ దుర్ఘటనపై సర్కార్ చర్యలు... ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు

By Arun Kumar PFirst Published May 8, 2020, 12:35 PM IST
Highlights

విశాఖలో 12మంది ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా వందలాది మందిని అనారోగ్యంపాలు చేసిన ఎల్జీ పాలిమర్ పరిశ్రమపై జగన్ ప్రభుత్వం సీరియస్ చర్యలకు ఉపక్రమించింది.  

అమరావతి: విశాఖలో గురువారం కలకలం సృష్టించిన విషపూరిత గ్యాస్ లీకేజీ దుర్ఘటనను జగన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటన జరిగిన వెంటనే విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి బాధితులకు అండగా వుంటానన్న హామీ ఇచ్చారు. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టేందుకు ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని సభ్యుల పేర్లను వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ చైర్మన్ గా మొత్తం ఐదుగురు సభ్యులతో ఈ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా కరికాల వలవన్, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ సీపీ ఆర్కే మీనా, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ లను ఎంపికచేసింది. 

ఈ గ్యాస్ లీక్ ఘటనలో కంపెనీ నిర్లక్ష్యంపై ప్రధానంగా విచారణ చేయనుంది ఈ కమిటీ. భవిష్యత్తులో ఎల్జీ పొలిమర్స్ వల్ల ఏవైనా ఇబ్బందులు వస్తాయా అన్నదానిపై కూడా విచారణ చేయనుంది. కంపెనీ నిర్లక్ష్యం ఉందని తేలితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ఈ ఉన్నత స్థాయి కమిటీయే ప్రభుత్వానికి సూచించనుంది. 

త్వరితగతిన విచారణను పూర్తిచేసి నివేదికను సమర్పించాల్సిందిగా ప్రభుత్వం కమిటీకి సూచించింది. ఈ దుర్ఘటనకు సంబంధించి నెలరోజుల్లోగా ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇవ్వాలని జగన్ ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. 

విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజలు భయకంపితులను చేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 12 మంది మృత్యువాతపడగా వందల మంది తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థిలి విషమంగా వుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం వున్నట్లు సమాచారం. 


 

click me!