చేదు అనుభవం... వైసిపి ఎమ్మెల్యే పర్యటన వేళ 'సైకో పోవాలి, సైకిల్ రావాలి' పాటను హోరెత్తించి

By Arun Kumar PFirst Published Jun 9, 2023, 1:06 PM IST
Highlights

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు చేదు అనుభవం ఎదురయ్యింది. 

చిత్తూరు : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళుతున్న కొందరు వైసిపి ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇలా ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలను తమ సమస్యలపై ప్రశ్నిస్తూ ప్రజలు నిలదీసిన ఘటనలు వెలుగుచూసాయి. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వైసిపి ఎమ్మెల్యేకు ఇలాంటి వింత అనుభవమే ఎదురయ్యింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గడపగడపకు కార్యక్రమం కోసం ఓ గ్రామానికి వెళ్ళి ప్రజాగ్రహన్ని చవిచూసారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వైసిసి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లె గ్రామంలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పర్యటించారు. ఎమ్మెల్యే గ్రామానికి విచ్చేసిన సమయంలో గ్రామంలోని మైకుల్లో టిడిపి పాటలు హోరెత్తాయి.'సైకో పోవాలి... సైకిల్ రావాలి' అంటూ సాగే పాటను గ్రామస్తులు పెట్టారు. దీంతో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తీవ్ర అసహానానికి గురయ్యారు. 

Read More  వైఎస్ వివేకా హత్య కేసు: జగన్ కు ముందే తెలుసన్న సీబీఐ

మొగిలివారిపల్లె గ్రామంలో కేవలం 90 ఇళ్లుమాత్రమే వుండగా అందులోనూ అత్యధికులు టిడిపికి చెందినవారే. దీంతో ఇటీవల ఎన్టీఆర్ జయంతి, మహానాడు సందర్భంగా టిడిపి జెండాలు, బ్యానర్లు భారీగా ఏర్పాటుచేసారు. అలాగే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి చేపట్టిన 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి'నిరసన పోస్టర్లు గ్రామమంతా కనిపించాయి. దీంతో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కేవలం రెండుమూడు ఇళ్లకు మాత్రమే వెళ్లి వెనుదిరిగారు. 

వైసిపి నాయకులు, పోలీసులు కోరడంతో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వెళ్లేవరకు పాటలు నిలిసివేసారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా వుండి గ్రామానికి ఏం చేసారంటూ బాబును గ్రామస్తులు నిలదీసారు. ఇలా గ్రామస్తుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కొద్దిసేపట్లోనే కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్లిపోయారు. 

ఇటీవల ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఇలాంటి చేదు అనుభవమే ఎదురయ్యింది.గడపగడపకు కార్యక్రమంలో భాగంగా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే జగన్మోహనరావుపై ప్రజలు తిరగబడ్డారు. తమకు ఇళ్లు లేవని కొందరు, వీధుల్లో కరెంట్ స్తంభాలు లేవంటూ మరికొందరు ఎమ్మెల్యేను నిలదీసారు. తమకు ఏం చేసారో చెప్పాలంటూ యువకులు, మహిళలు ఎమ్మెల్యేను నిలదీసారు. తమ ఇళ్లవద్దకు రావద్దని కొందరు ఎమ్మెల్యే మొహంమీదే చెప్పేసారు.  

ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరిస్థితి కూడా ఇంతే... మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో  గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఓ యువకుడు నిలదీసాడు.గత రెండుసంవత్సరాలుగా విద్యాదీవెన కింద తనకు ప్రభుత్వం నుండి రావాల్సిన రూ.80వేలు రాలేవని... దీంతో చదువు అర్ధాంతరంగా ఆగిపోయిందంటూ ఎమ్మెల్యేతో చెప్పుకున్నాడు. కరోనా కారణంగానే ఈ సమస్య తలెత్తిందని ఎమ్మెల్యే సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు. అయినప్పటికి వైసిపి ప్రభుత్వంతో పాటు ఆయనను విమర్శించేలా మాట్లాడటంతో తీవ్ర అసహనానికి గురయిన ఎమ్మెల్యే రమేష్ బాబు ఎవడ్రా నువ్వు నాతో మాట్లాడేందుకు? అంటూ యువకుడి పైపైకి వెళ్ళారు. 

click me!