కొడాలి నాని, వంగవీటి రాధా, పార్థసారథిలకు అరెస్ట్ వారెంట్ జారీ.. పూర్తి వివరాలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Sep 13, 2023, 10:24 AM IST
Highlights

విజయవాడ ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టు పలువురు ప్రజాప్రతినిధులకు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఆ జాబితాలో వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కొడాలి నాని, పార్థసారథి, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఉన్నారు.

విజయవాడ ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టు పలువురు ప్రజాప్రతినిధులకు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఆ జాబితాలో వైసీపీ నేతలు, మాజీ మంత్రులు కొడాలి నాని, కొలుసు పార్థసారథి, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఉన్నారు. ప్రజాప్రతినిధులపై కేసులను విచారిస్తున్న విజయవాడలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఈ ముగ్గురు నేతలకు నాన్ బెయిలబుల్ వారెంట్(ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేశారు. వివరాలు.. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రత్యేక హోదా కోసం ఆందోళన నిర్వహించింది. 
2015 ఆగస్టు 29న ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది. 

వైసీపీ బంద్ పిలుపులో భాగంగా ఆ పార్టీ నేతలు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సంబంధించి కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో 55 మందిపై కేసు నమోదైంది. ఇందులో ఏ1గా పార్థసారథి, ఏ2గా కొడాలి నాని, ఏ3గా వంగవీటి రాధా(అప్పట్లో వైసీపీలో ఉన్నారు) పేర్లతో పాటు మరో 52 మంది నేతలు ఉన్నారు. వీరిపై ఐపీసీలోని సెక్షన్లు 341, 188, 290 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు.

అయితే ఈ కేసుకు సంబంధించి విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతుంది. మంగళవారం రోజు జరిగిన విచారణకు కొడాలి నాని, పార్థసారథి, వంగవీటి రాధా హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి వారికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ  చేశారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. 

click me!