
విజయవాడలో ఓ మహిళ పోలీసులు నగర బహిష్కరణకు గురికావడం హాట్ టాపిక్‌గా మారింది. విజయవాడలో నగర బహిష్కరణ ఎదుర్కొబోతున్న తొలి మహిళగా ఆమె నిలవనున్నారని చెబుతున్నారు. వివరాలు.. సారమ్మ అలియాస్ శారద అనే మహిళ పలుసార్లు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది. పోలీసుల కళ్లుగప్పి దందాలు చేయడంలో ఆమె సూపర్ ఫాస్ట్. ఇప్పటికే విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె పేరుపై 13 కేసులు నమోదయ్యాయి.
గంజాయి అమ్మడమే కాకుండా పలు వివాదల్లో సారమ్మ ప్రమేయం ఉంది. పలు కేసులు నమోదు అయినప్పటికీ, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు విజయవాడ నగరం నుంచి బహిష్కరణ అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటివరకు గంజాయి దందాకు పాల్పడుతున్న 19 మందిని కూడా నగరం నుంచి బహిష్కరించారు.
అయితే ఇటీవలి కాలంలో విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో గంజాయి దందా ఘటనలు వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు సారమ్మపై నగర బహిష్కరణ వేటు వేసినట్టుగా తెలుస్తోంది.