
అమరావతి: వద్దు వద్దు బిడ్డో సర్కారు దవాఖానకు...నేను రాను బిడ్డో సావూల దవాఖనకు... ఇది ఓ పాత సినిమాలోని సాంగ్ లో లిరిక్స్. ఈ సినిమా పాట మన ప్రభుత్వ హాస్పిటల్స్ లో రోగుల దయనీయ పరిస్థితిని తెలియజేస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్స్ పెద్దపెద్ద కార్పోరేట్ స్థాయి బిల్డింగుల్లోకి మారినా, అధునాతన పరికరాలను కలిగివున్నా సిబ్బంది తీరులో మాత్రం ఆనాటికీ ఈనాటీకి ఏమాత్రం తేడా లేదు. పేషెంట్స్ కు వైద్యం అందించడంలో అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. ప్రభుత్వ హాస్పిటల్స్ సిబ్బంది వైద్యంకోసం వచ్చే నిరుపేద ప్రజలను ఎలా పట్టిపీడిస్తున్నారో తెలియజేసే సంఘటన ఒకటి ఇటీవల విజయవాడలో వెలుగుచూసింది.
మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని డోలాస్ నగర్ కు చెందిన సామ్రాజ్యం అనే మహిళ వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. అయితే షుగర్ వ్యాది కారణంగా వైద్యులు ఆపరేషన్ చేసి ఆమె కాలిని తొలగించారు. ఈ ఆపరేషన్ అనంతరం కొద్దిరోజులు హాస్పిటల్ లోనే వున్న మహిళ డాక్టర్ల సూచన మేరకు డిశ్చార్జయి ఇంటికి వెళ్లింది.
అయితే ఆపరేషన్ తర్వాత వేసిన కుట్లను తొలగించేందుకు హాస్పిటల్ కు రావాల్సి వుంటుందని డిశ్చార్జి సమయంలోనే డాక్టర్లు సూచించారు. దీంతో కుటుంబసభ్యుల సాయంలో కుట్లను తీసివేయించుకునేందుకు ఓ వాహనంలో సామ్రాజ్యం విజయవాడ జిజిహెచ్ కు వచ్చింది. నడవలేని పరిస్థితిలో వున్న ఆమెను వీల్ చైర్ లో లోపలికి తీసుకెళ్ళాలని భావించారు. ఇందుకోసం హాస్పిటల్ సిబ్బందిని సంప్రదించారు.
ఈ క్రమంలోనే ఓ వార్డు బాయ్ వీల్ ఛైర్ కావాలంటే తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఇప్పటికే వైద్యఖర్చులకు తాము బాగా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చిందని... డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితిలో వున్నామని సామ్రాజ్యం కుటుంబసభ్యులు సదరు వార్డు బాయ్ ని వేడుకున్నారు. అయినా వినిపించుకోని అతడు డబ్బులు ఇస్తేనే వీల్ ఛైర్ ఇస్తానని చెప్పాడు.
దీంతో చేసేదేమిలేక నడవలేని స్థితిలో వున్న పేషెంట్ ని చేతులపై ఎత్తుకుని కుటుంబసభ్యులు హాస్పిటల్ లోకి తీసుకెళ్లారు. హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు ఇలా పేషెంట్ ను మోసుకెళ్లడం చూసినా తమకేమీ పట్టనట్లుగా వెళ్లిపోయారు.
వైద్యం కోసం వచ్చిన నిరుపేదలను ప్రభుత్వాస్పత్రి సిబ్బంది డబ్బులు కోసం వేధించడం పరిపాటిగా మారిందని మిగతా పేషెంట్స్ సహాయకులు కూడా చెబుతున్నారు. వెంటనే వైద్యశాఖ ఉన్నతాధికారులు డబ్బులు డిమాండ్ చేసిన వార్డ్ బాయ్ తో పాటు విషయం తెలిసినా పట్టించుకోని మిగతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు లేకే నిరుపేద ప్రజలు ప్రభుత్వాస్పత్రులకు వస్తుంటారని... వారిని ఇలా డబ్బుల కోసం వేధించకుండా చూడాలని కోరుతున్నారు.
ఈ ఘటనపై వివాదం రేగడంతో హాస్పిటల్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ స్పందించారు. హాస్పిటల్ లో వీల్ ఛైర్లు, స్ట్రెచర్లు తగినన్ని వున్నాయని... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఈ ఘటనపైనా విచారణ జరిని తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ తెలిపారు.