
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మళ్లీ విచారణను మొదలుపెట్టారు. కడప జిల్లా పులివెందుల ఆర్ అండ్ బీ అతిథిగృహంలో సీబీఐ విచారణ కొనసాగిస్తున్నారు. సోమవారం ముగ్గురు అనుమానితులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. వారిలో నెల్లూరు జి్లా సాక్షి విలేకరి బాలకృష్ణారెడ్డి, పులివెందులకు చెందిన ఉదయ్‌కుమార్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఉన్నారు.
నెల్లూరు జిల్లా సాక్షి విలేకరిగా ఉన్న బాలకృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు ఇదివరకు పలుమార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వివేకా హత్య జరిగినప్పుడు బాలకృష్ణారెడ్డి కడప సాక్షి విలేకరిగా పనిచేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని బాలకృష్ణారెడ్డికి శివ శంకర్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. గతంలో పలుమార్లు బాలకృష్ణారెడ్డిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. మరోసారి ఆయనను విచారిస్తున్నారు. అయితే ఇందుకు రెండ్రోజుల క్రితం కూడా సాక్షి పత్రిక, టీవీ విలేకరులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. జమ్మలమడుగుకు చెందిన సాక్షి పత్రిక, టీవీ విలేకరులను వారు విచారించారు.
పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి యురేనియం కర్మాగారంలో పనిచేస్తున్నాడు. ఇప్పటికే సీబీఐ అధికారులు ఉదయ్ కుమార్ రెడ్డిని పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి ప్రకాశ్‌రెడ్డి కుట్లువేశారని సీబీఐ అభియోగం మోపారు. ఇక, రెండు రోజుల క్రితం ఉదయ్ పనిచేస్తున్న కర్మాగారానికి వెళ్లిన సీబీఐ అధికారులు అతని కోసం ఆరా తీసినట్టుగా సమాచారం. తాజాగా నేడు మరోసారి ఉదయ్‌ను అధికారులు విచారిస్తున్నారు.
సీబీఐ విచారణకు డాక్టర్ మధుసూదన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈయన పులివెందుల ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.