
తెలుగుదేశం పార్టీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. TDP హయాంలో రోడ్ల నిర్వహణను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వ హయాంలోనే రోడ్లలన్నీ పాడైపోయినట్టుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రోడ్లు, భవనాల శాఖపై సీఎం వైఎస్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర‍్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రూ.2205 కోట్లు రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు కేటాయించడం జరిగిందని సీఎం జగన్ చెప్పారు. ఒక ఏడాదిలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత డబ్బు ఇవ్వలేదని తెలిపారు.
ఈ సదంర్బంగా మే చివరి నాటికి దాదాపుగా రోడ్లు నిర్మాణం, మరమ్మతుపనులు పూర్తిచేస్తామన్న అధికారులు సీఎం జగన్‌కు చెప్పారు. ఇప్పటివరకూ 83 శాతం రోడ్డు పనులకు సంబంధించిన టెండర్లు పూర్తి చేశామని, నెలఖారు నాటికి 100 శాతం టెండర్లు పూర్తవుతాయని తెలిపారు. 33 ఆర్వోబీలు చాలా కాలంగా పెడింగ్‌లో ఉన్నాయన్న అన్నారు.
గత ప్రభుత్వం రహదారుల నిర్వహణను పట్టించుకోలేదన్న సీఎం జగన్.. ఆ తర్వాత వర్షాలు పడటంతో రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్టుగా వక్రీకరించి.. విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం హయాంలోనే ఇవి పూర్తికాలేదన్న రీతిలో కథనాలు ఇస్తున్నారని మండిపడ్డారు.