
విజయవాడలో (Vijyawada) తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఓ వ్యక్తి వేధింపులు తాళలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని బాలిక సూసైడ్ నోట్ (Suicide Note) రాయడం సంచలనంగా మారింది. బాలిక ఆత్మహత్యకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బాలిక ఉండే అపార్ట్‌మెంట్‌లోనే నివాసం ఉంటున్న టీడీపీ నేత వినోద్ జైన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అతడి ఇంటిని కూడా సీజ్ చేశారు.
నిందితుడు వినోద్ జైన్ ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశాడు. గత రెండు నెలల నుంచి బాలికను వినోద్ జైన్ వేధిస్తున్నాడని… పలు సార్లు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడి వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుందని వారు చెప్తున్నారు.
అసలేం జరిగిందంటే.. భవానిపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో నివాసం ఉంటున్న బాలిక.. బెంజి సర్కిల్ వద్దగల ఒక పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. అయితే తనను ఓ యువకుడు గత కొన్ని రోజులు వేధిస్తున్నాడని నోట్ బుక్‌లో రాసి బాలిక అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో పడివున్న బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడక ముందు ముందు టెర్రస్‌పై 20 నిమిషాల పాటు బాలిక అటూ ఇటూ తిరుగుతూ సీసీ టీవీ కెమెరాల్లో కనిపించిందని పోలీసులు వెల్లడించారు.