
చిలకలూరిపేట: అమెరికా వెళ్లిన ఇంటి యజమానులు ఎలాగూ కొన్ని నెలలకు గానీ తిరిగిరారు కాబట్టి రెండు మూడు ఇక్కడే తాపీగా వుండి దొంగతనం (robbery) చెద్దామని అనుకున్నట్లున్నాడు ఓ ఘరానా దొంగ. సొంత ఇంట్లో మాదిరిగా తలుపులన్ని బార్లా తెరిచి మచంమీద హాయిగా పడుకున్నాడు. ఇలా దొంగతనానికి వెళ్లిన ఇంట్లో నిద్రించి రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడ్డాడు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట (chilakaluripet) పండరీపురంలోని ఐటీసి గోదాం ఎదురుగా నివాసముండే ఓ కుటుంబం కొంతకాలం క్రితం అమెరికా వెళ్లింది. ఇంటికి తాళం వేసి తిరగి వచ్చేవరకు కాస్త ఇంటిని చూస్తూ వుండమని చుట్టుపక్కల ఇళ్ళవాళ్లకు చెప్పి వెళ్లారు.
అయితే తాళం వేసివున్న ఈ ఇంటిపై ఓ దొంగ కన్ను పడింది. కుటుంబమంతా అమెరికా వెళ్లినట్లు తెలుసుకున్ని సదరు దొంగ తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఈ క్రమంలోనే తలుపులు అలాగే తెరిచివుంచి దర్జాగా ఇంట్లోకి వెళ్లిపోయాడు. కొంతసేపు ఇళ్లుమొత్తం వెతికినా విలువైన వస్తువులేవీ అతడికి చిక్కలేవు.
అయితే ఇంటి యజమానులు ఎలాగూ రారని తెలుసు కాబట్టి కొద్దిసేపు పడుకుని దొంగతనం కొనసాగిద్దామని బావించాడో ఏమో మంచంపై కునుకు తీసాడు. అయితే చిన్న కునుకు కాస్త గాడనిద్రగా మారి రాత్రంతా అలాగే పడుకుని వుండిపోయాడు సదరు దొంగ.
ఈ క్రమంలో తెల్లవారుజామున ఇంటి తలుపులు తెరిచివుండటం గమనించిన చుట్టుపక్కల వారు లోపలికి వెళ్లిచూడగా దొంగ హాయిగా నిద్రిస్తుండటం గమనించారు. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు దొంగను నిద్రలేపిమరీ అరెస్ట్ చేసారు.
దొంగతనం చేయడానికి ఆ ఇంట్లోకి చొరబడినట్లు విచారణలో సదరు దొంగ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.