
Chintamani Natakam : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందిన చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ ఈనెల 17న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ (నర్సాపురం) రఘురామకృష్ణరాజు వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులును ప్రతివాదులుగా చేర్చారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవదాసి వ్యవస్థ, వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా సామాజిక సంస్కర్త కళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారని పిటిషన్‌లో వివరించారు. 1920 నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారని, జగన్ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ఈ నాటకాన్ని ప్రదర్శిస్తూ వేలమంది కళాకారులు జీవనోపాధి పొందుతున్నారని, ఈ నాటకంపై ఆధారపడి ఉన్న కళాకారులు రోడ్డున పడతారని రఘురామకృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ నాటకం ప్రదర్శించిన కళాకారులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గతంలో పలు అవార్డులు, బహుమానాలు ఇచ్చాయనీ, ఈ నాటకం ద్వారా మంచి గుర్తింపు పొందిన కళాకారుడు స్థానం నరసింహారావుకు 1956లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించిందని గుర్తు చేశారు. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ‘చింతామణి’ ఈ నాటకం ఓ ఊపు ఊపేసింది. తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర ప్రధానం. ఆయన ఓ వైశ్యుడు. స్త్రీ వ్యామోహంలో పడి డబ్బు ఎలా పోగొట్టుకున్నాడు. అయితే ఈ పాత్ర ద్వారా తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆర్య వైశ్యులు ఆరోపిస్తున్నారు. తమ మనోభావాలను కించపరుస్తూ చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. మాజీ సీఎం రోశయ్య హయాంలో చింతామణి నాటక ప్రదర్శన రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వారు చెబుతున్నారు.
చింతామణి నాటకం శతజయంతి వేడుకల్లో ఈ వివాదం మరోసారి తెర మీదికి వచ్చింది. శతజయంతి పేరుతో నాటకాన్ని ప్రదర్శిస్తే ఉద్యమం చేస్తామని ఆర్య వైశ్యులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో నిరసనలు వ్యక్తం కావడంతో చింతామణి నాటకాన్ని నిషేధిస్తుట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.