
విజయవాడ నగరంలో దసరా, దేవీ శరన్నవరాత్రి వేడుకలు సహజయంగానే ఘనంగా జరుగుతాయి. అయితే ఈ సంబరాలకు మరింత ఉత్సాహాన్ని జోడించేలా ‘రాగ దాండియా ఉత్సవ్ 2.0’ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో, వీ వైబ్ సహకారంతో అక్టోబర్ 17న అంటే రేపు (శనివారం) ఈ వేడుక జరగనుంది. సంప్రదాయ నృత్యాలు, సంగీతం, సినీ ప్రముఖుల సందడి, వినోద కార్యక్రమాలతో నగర ప్రజలకు ప్రత్యేక అనుభూతిని అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
విజయవాడలోని ఎం.జి. రోడ్డులోని ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్లో అక్టోబర్ 17న సాయంత్రం 7 గంటలకు ఈ రాగ దాండియా ఉత్సవ్ 2.0 కార్యక్రమం ప్రారంభం కానుంది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలో నగర ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
బందర్ రోడ్డులోని లబ్బీపేట వేగా జ్యువెలర్స్ షోరూమ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా దాండియా ఉత్సవ్ లో కార్యక్రమాలను రూపొందించినట్లు చెప్పారు.
‘రాగ దాండియా ఉత్సవ్ 2.0’కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించనున్నారు. టాలీవుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వేడుకలో బిగ్ బాస్ ఫేమ్ ఉదయ్ మాస్టర్, ఆయన బృందం ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఇవ్వనుంది. ఇద్దరు ప్రముఖ డీజేల సంగీతంతో పాటు సంప్రదాయ పంజాబీ ధోల్ వాయిద్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన యువతీ యువకులు దాండియా నృత్యాలతో సందడి చేయనున్నారు.
సందర్శకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించేందుకు నిర్వాహకులు పలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవేశ ద్వారం వద్ద ఆరతి, తిలకంతో అతిథులకు స్వాగతం పలకనున్నారు. వేడుక ప్రాంగణంలో రుచికరమైన ఆహార పదార్థాల స్టాల్స్, మాక్టెయిల్స్ కౌంటర్లు, ఫేస్ పెయింటింగ్, రంగురంగుల గాజుల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు.
అలాగే సంప్రదాయ పోటీలు, ప్రత్యేక ‘మ్యాగ్నెటిక్ ఫొటో బూత్’, సెల్ఫీ పాయింట్లు కూడా సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకల్లో పాల్గొంటూ జ్ఞాపకాలను పదిలం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు.
సంగీతం, నృత్యం, సంప్రదాయ కళలు, వినోదాన్ని ఒకే ప్లాట్ ఫామ్ పైకి తీసుకురావడమే ‘రాగ దాండియా ఉత్సవ్ 2.0’ ఉద్దేశమని వేగా జ్యువెలర్స్ ఎండీ నవీన్ వనమా తెలిపారు. విజయవాడ నగర ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను విజయవంతం చేయాలని నవీన్ వనమా కోరారు.