దసరా శరన్నవరాత్రులకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది . రోజుకు లక్షా 70 వేల మంది భక్తులు కనకదుర్గమ్మను దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ఇతర వీఐపీలు స్వయంగా వస్తేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు.
దసరా శరన్నవరాత్రులకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి సిద్ధమవుతోంది. ఈ నెల 15 నుంచి 23 వరకు తొమ్మిది రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. దీనిలో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. ఈ సమయంలో రోజుకు లక్షా 70 వేల మంది భక్తులు కనకదుర్గమ్మను దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. సెకనుకు ఇద్దరు, ముగ్గురు భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు.
రోజులో 20 గంటలు భక్తుల దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించారు. ప్రజా ప్రతినిధులు, ఇతర వీఐపీలు స్వయంగా వస్తేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు. తొలి రోజు అమ్మవారి స్నాపన అభిషేకం అనంతరం ఉదయం 9 గంటల నుంచి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 10 గంటల వరకు దుర్గమ్మను దర్శించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. మూలా నక్షత్రం రోజున తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శించుకోవచ్చని తెలిపింది.
ALso Read: బెజవాడ దుర్గగుడిలో అనూహ్య పరిణామాలు.. ఈవోగా కేఎస్ రామారావు , తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశం
కాగా.. కనకదుర్గమ్మ గుడి కార్యనిర్వహణాధికారిగా (ఈవో) కేఎస్ రామారావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. తక్షణమే విధులు స్వీకరించాలని సర్కార్ ఆయనను ఆదేశించింది. ప్రస్తుతం శ్రీకాళహస్తి ఆర్డీవోగా పనిచేస్తున్నారు రామారావు. అయితే తొలుత ఈ నెల 1న దుర్గగుడి ఈవోగా వున్న భ్రమరాంబను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆమె స్థానంలో డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ అధికారి ఎం శ్రీనివాస్‌ను ఈవోగా నియమించింది. అయితే రోజులు గడుస్తున్నా ఆయన విధుల్లో చేరకపోవడంతో రామారావును ఈవోగా నియమిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే సరిగ్గా శరన్నవరాత్రులకు కొద్దిరోజుల ముందు ఈవో భ్రమరాంబ బదిలీ వ్యవహారం విజయవాడతో పాటు దేవాదాయ శాఖలో చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా దుర్గగుడి ఈవో భ్రమరాంబకి, ఆలయ పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబుకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ బదిలీ వెనుక రాజకీయ కోణం వున్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఏ రోజున ఏ అలంకారం అంటే :
అక్టోబర్ 15 - బాలా త్రిపురసుందరి
అక్టోబరు 16 - గాయత్రీ దేవి
అక్టోబరు 17 - అన్నపూర్ణ దేవి
అక్టోబరు 18 - మహాలక్ష్మి
అక్టోబరు 19 - మహాచండీ
అక్టోబరు 20 - సరస్వతి
అక్టోబరు 21 - లలితా త్రిపుర సుందరి
అక్టోబరు 22 - దుర్గాదేవి
అక్టోబరు 23 - మహిషాసుర మర్దిని, మధ్యాహ్నం నుంచి శ్రీ రాజరాజేశ్వరి