విజయసాయి రెడ్డి ఉక్కు పోరాట యాత్ర ప్రారంభం: 23 కిలోమీటర్లు నడక

By telugu teamFirst Published Feb 20, 2021, 9:04 AM IST
Highlights

విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. జీవీఎంసీ నుంచి ప్రారంభమైన ఆయన యాత్ర స్టీల్ ప్లాంట్ వరకు సాగనుంది.

విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉక్కు పోరాట యాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. జీవీఎంసీ నుంచి ఆయన తన యాత్రను ప్రారంభించారు. దానికి ముందు జీవీఎంసి వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. విజయసాయి రెడ్డి ఉక్కు పోరాట యాత్రలో మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

విజయసాయి రెడ్డి ఉక్కు పోరాట యాత్రకు పెద్ద యెత్తున వైసిపి శ్రేణులు చేరుకుంటున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం విజయసాయి రెడ్డి ఈ పోరాట యాత్రను తలపెట్టారు. జీవీఎంసీ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఉక్కు ఫ్యాక్టరీ గేటు వరకు సాగుతుంది.

విజయసాయి రెడ్డి పాదయాత్ర 23 కిలోమీటర్లు సాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఉక్కు ఫ్యాక్టరీ వద్ద బహిరంగ సభ జరుగుతుంది. విశాఖ ఉక్క కర్మాగారంలో పెట్టుబడులను ఉపసంహరించి, ప్రైవేట్ పరం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి వ్యతిరేకంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఆందోళనకు దిగుతున్నాయి.

ప్రతిపక్షాలకు దీటుగా ఆందోళన సాగించాలనే ఉద్దేశంతో అధికార వైసీపీ ఉన్నట్లు అర్థమవుతోంది. ఇందులో భాగంగానే విజయసాయి రెడ్డి తన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పార్లమెంటు లోపలా, బయటా పోరాటం చేస్తున్నామని విజయసాయి రెడ్డి చెప్పారు. శక్తివంచన లేకుండా పోరాటం చేస్తామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరి,స్థితిలో కూడా ప్రైవేటీకరించేందుకు అంగీకరించబోమని ఆయన చెప్పారు. 

click me!