కేంద్రానికి మద్దతు ఇచ్చామన్న విజయసాయిరెడ్డి

First Published Jul 10, 2018, 4:38 PM IST
Highlights

అందుకే జమిలి ఎన్నికలకు వైసీపీ మద్దతు ఇస్తోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. జమిలి ఎన్నికలతో ఖర్చు, అవినీతి తగ్గుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

జమిలి ఎన్నికల విషయంలో తమ పార్టీ కేంద్రానికి పూర్తి మద్దతు ప్రకటించినట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ మేరకు లా కమిషన్ ఛైర్మన్ కు లేఖ కూడా రాశారు.

జమిలి ఎన్నికలవల్ల కలిగే లాభాలను ఆ లేఖలో వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పలుమార్లు జమిలి ఎన్నికలు జరిగిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. జమిలి ఎన్నికలు నిర్వహించడంవల్ల అనేక సవాళ్లు ఎదురవుతాయని, వాటన్నింటిని అధిగమించాల్సి ఉందని అన్నారు. తమ అభిప్రాయాలను పరిశీలించి దేశ హితం కోసం అది మంచిదయితే ఆ నిర్ణయం తీసుకోవాలని విజయసాయి లా కమిషన్ ఛైర్మన్‌ను కోరారు.
 
ఈ సందర్భంగా విజయసాయి మీడియాతో మాట్లాడుతూ 1951 నుంచి 1967 వరకు, 1999 నుంచి ఇప్పటి వరకు ఏపీకి కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. అందుకే జమిలి ఎన్నికలకు వైసీపీ మద్దతు ఇస్తోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. జమిలి ఎన్నికలతో ఖర్చు, అవినీతి తగ్గుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవి కోసం... బీజేపీ, మిత్రపక్షాలు ఏ అభ్యర్థిని నిలబెట్టినా వైసీపీ మద్దతు ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వనందున బీజేపీకి మద్దతు ఇవ్వబోమన్నారు. నైతిక విలువలులేని, సమాజంలో ప్రమాదకరమైన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. దోచుకున్న సొమ్మును దాచేందుకే చంద్రబాబు సింగపూర్‌ వెళ్లారని, టీటీడీ జేఈవో సింగపూర్‌ ఎందుకు వెళ్లారో చెప్పాలని విజయసాయి డిమాండ్ చేశారు.

click me!