యువ సీఎం నాయకత్వంలో అద్భుతాలు...: విజయసాయి రెడ్డి

By Arun Kumar PFirst Published Jun 1, 2021, 3:36 PM IST
Highlights

పరాజయంపాలై రెండేళ్లు గడిచినా బాబులో ఇప్పటికీ పరివర్తన రాలేదని మండిపడ్డారు వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి.

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. తన ఓటమికి ప్రజలే కారణమన్న చంద్రబాబు వ్యాఖ్యలను గుర్తుచేస్తూ సోషల్ మీడియా వేదికన ఎద్దేవా చేశారు. 

''పరాజయంపాలై రెండేళ్లు గడిచినా బాబులో ఇప్పటికీ పరివర్తన రాలేదు. ఎందుకు ఓడానో తెలియదని, తనను అర్థం చేసుకొనే శక్తిలేకే ఓడించారని ప్రజలను నిందిస్తున్నాడు. ఎగ్జామ్ బాగా రాసినా పేపర్లు దిద్దిన టీచర్ కావాలనే తనను ఫెయిల్ చేశాడని విద్యార్థి ఏడ్చినట్టుంది బాబు వ్యవహారం'' అంటూ ట్విట్టర్ వేదికన చంద్రబాబుపై సెటైర్లు వేశారు.

''రెండేళ్లలో జగన్ గారు ఏం చేయక పోతే 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పచ్చపార్టీ అడ్రసు లేకుండా ఎందుకు పోతుంది? పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దరిద్రం ఎందుకు పట్టుకుంటుంది. వచ్చే మూడేళ్లలో యువ సిఎం నాయకత్వంలో ఇంకా అద్భుతాలు జరుగుతాయి'' అన్నారు. 

video  చంద్రబాబు ప్రజల ప్రాణాలు తీస్తే జగన్ ప్రాణాలు పోస్తున్నారు: ఆళ్ళ నాని

''వచ్చే సార్వత్రక ఎన్నికలనాటికి బిజెపి (రానిచ్చినా) వెంట ఉంటాడనే నమ్మకం ఏమీ లేదు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని అనుమానం వస్తే అంతకు ముందు వదిలేసి వచ్చినోళ్ల కాళ్లు పట్టుకుంటాడు. బాబుకు ఇప్పుడు కావాల్సింది అధికారం కాదు. ఆస్తులు కాపాడుకోవడం, అరెస్టుల నుంచి తప్పించుకోవడం'' అని ఆరోపించారు. 

''బాబూ, నీది మీటర్ గేజ్ పై తిరిగే రైలు. ఈ రెండేళ్లలో రాష్ట్రమంతా గేజి మార్పిడి జరిగి బ్రాడ్ గేజ్ అందుబాటులోకి వచ్చింది. అయినా ఈ పట్టాల మీదే తిప్పుతా అంటే రైలు అక్కడే కూరుకుపోతుంది. దానిని అలా  వదిలేస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు ప్రజలు. వ్యర్థ తాపత్రయాలు మానుకో'' అంటూ చంద్రబాబును హెచ్చరించారు విజయసాయి రెడ్డి. 

click me!