ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ నిమిషానికోసారి బెదిరిస్తున్నారని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ: ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శరీరం మాత్రమే నిమ్మగడ్దదని, చంద్రబాబు నిమ్మగడ్డ శరీరంలో చంద్రముఖిలా ప్రవేశించి లకలక అంటున్నారని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. పార్టీ పరంగా ఎన్నికలు జరగవని చంద్రబాబు తెలియదా అని, అటువంటి స్థితిలో ఎన్నికల మానిఫెస్టోను ఎలా విడుదల చేశారని ఆయన అడిగారు.
చంద్రబాబుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాలూచీ పడ్డారని ఆయన అన్నారు. రోజూ మీడియా సమావేశాలు నిర్వహించే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ విధం వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు.
చంద్రబాబు వెన్నుపోటుదారుల సంఘం జాతీయాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దేవాలయాల్లో చంద్రబాబు దొంగతనాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుమార్ మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నిమ్మగడ్డ మానసిక పరిస్థితిపై వైద్యులతో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి నిమిషానికి బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రవచనాలు చెప్పడంలో చాగంటిని మించిపోయారని ఆయన నిమ్మగడ్డపై అన్నారు.
ఎస్ఈసీ పనితీరు సరిగా లేదని ఆయన అన్నారు మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తి రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండడం ప్రమాదకరమని ఆయన అన్నారు. మెడికల్ బోర్డుకు నిమ్మగడ్డను రెఫర్ చేయాలని ఆయన అన్నారు. నిమ్మగడ్డ కందగడ్డనో, చామగడ్డనో ఉల్లిగడ్డనో అర్థం కావండ లేదని ఆయన అన్నారు. నిమ్మగడ్డ ఎన్నికల కమిషనరో టీడీపీ కమిషనరో కూడా అర్థం కావడం లేదని ఆయన అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇతర ఐఎఎస్ అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విజయసాయి రెడ్డి అన్నారు.