పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు: భగ్గుమన్న బిజెపి నేత దేవధర్

By telugu teamFirst Published Sep 28, 2020, 1:40 PM IST
Highlights

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను జాతి నాయకురాలిగా అభివర్ణించారు. దానిపై బిజెపి నేత దియోధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆమెపై విమర్శలు చేశారు. పురంధేశ్వరి ఈ రోజు ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూతో, అందులో రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైందని ఆయన వ్యాఖ్యానించారు. 

కాగా, దానికి ముందు విజయసాయి రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే కొంత మంది రాజ్యాంగాన్ని అతిక్రమించి ప్రవరిస్తున్నారని ఆయన అన్నారు. అలాంటి వారికి సద్బుద్ధిని ప్రసాదించాలని దేవున్ని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

కాగా, పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ సునీల్ దియోధర్ తీవ్రంగా మండిపడ్డారు. పురంధేశ్వరిని కులం పేరుతో విమర్శిస్తారా అని ఆయన ప్రశ్నించారు. దేశాభివృద్ధి కోసం బిజెపి కులాలకు, మతాలకు అతీతంగా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. 

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే పురంధేశ్వరిని కులంపేరుతో విమర్శిస్తారా అని ఆయన విజయసాయి రెడ్డిని అడిగారు. అర్హత చూసి పురంధేశ్వరికి పదవి ఇస్తే కులంతో ముడిపెడుతారా అని ఆయన విజయసాయి రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ కులమయం చేసి వైసీపీ కులాల గురించి మాట్లాడడం హేయమని ఆయన అన్నారు.

click me!