Vijayanagaram: విద్యార్థినులపై లైంగిక వేధింపులు... ఇద్దరు కీచక టీచర్లపై క్రిమినల్ కేసులు, అరెస్ట్

Arun Kumar P   | Asianet News
Published : Feb 18, 2022, 12:53 PM ISTUpdated : Feb 18, 2022, 02:03 PM IST
Vijayanagaram: విద్యార్థినులపై లైంగిక వేధింపులు... ఇద్దరు కీచక టీచర్లపై క్రిమినల్ కేసులు, అరెస్ట్

సారాంశం

విద్యాబుద్దులు నేర్పాల్సిన వారే బుద్దితప్పి చిన్నారులతో నీచంగా ప్రవర్తిస్తూ వేధింపులకు దిగిన అమానుషం విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా ఈ కీచక టీచర్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 

అమరావతి: విజయనగరం జిల్లా (vijayanagaram district) గుమ్మలక్ష్మీపురంలో మండలం బాలేశు ప్రాథమిక పాఠశాల వెలుగుచూసిన ఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Aadimulapu Suresh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిణులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశాలతో ఇప్పటికే వారిపై విద్యాశాఖధికారులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. తక్షణమే విధులనుంచి తప్పించి విచారణకు ఆదేశించటంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. దీంతో ప్రధానోపాధ్యాయులు స్వామినాయుడు, ఉపాద్యాయుడు సూర్యనారాయణలపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసారు. 

చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు ఉపాధ్యాయులపై మూడు సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. పోక్సో చ‌ట్టం సెక్ష‌న్ 10తో పాటు, మ‌హిళ‌ల ప‌ట్ల అస‌భ్య ప్ర‌వ‌ర్త‌ించినందుకు సి.ఆర్‌.పి.సి. సెక్ష‌న్ 354, అలాగే ఎస్‌.సి., ఎస్‌.టి. అత్యాచార చ‌ట్టాల కింద  స్వామినాయుడు, సూర్యనారాయణపై కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కీచక ఉపాధ్యాయులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ ఘటనపై స్పందిస్తూ విద్యాశాఖమంత్రి సురేష్ ఉపాధ్యాయులకు తీవ్రంగా హెచ్చరించారు. ఇలా విద్యార్థులను వేధించే ఇతర ఉపాధ్యాయులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించటం, వేదించటం వంటి చర్యలను ఉపేక్షించేది లేదని... అటువంటి ఉపాధ్యాయుల పట్ల విద్యాశాఖ కఠినంగానే వ్యవహరిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పుతూ అంకితభావం, నిబద్దతతో పని చేయాలని సూచించారు. తాము చదువుచెప్పే పాఠశాలలోని విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలన్నారు. తల్లి, తండ్రి తరువాత గురువుదే స్థానమని... ఆ గౌరవాన్ని పోగొట్టుకునేలా వ్యవహరించవద్దని మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. 

విజయనగరం జిల్లా  గుమ్మలక్ష్మీపురం మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 92 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే వీరిలో ఎక్కువమంది గిరిజన విద్యార్థులే. దీంతో ఈ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని స్కూల్లో చదివే విద్యార్థిణులతో నీచంగా ప్రవర్తించడం ప్రారంభించారు ప్రధానోపాధ్యాయుడు స్వామి నాయుడు, ఉపాధ్యాయుడు సూర్యనారాయణ. మొత్తం నలుగురు టీచర్లు ఈ స్కూల్లో పనిచేస్తుండగా ఇద్దరు ఇలా విద్యార్థుణులతో నీచంగా ప్రవర్తించేవారు. 

ఒంటరిగా ఉన్న సమయాల్లో చిన్నారుల శరీరాన్ని తడుముతూ, తాకకూడని చోట్ల తాకుతూ, ముద్దులు పెడుతూ టీచర్లిద్దరూ అసభ్యంగా ప్రవర్తించేవారు. కురచ దుస్తుల్లో రావాలని... అలా వచ్చాక ఫోటోలు తీసేవారని విద్యార్ధిణులు తెలిపారు. అంతే కాదు యోగా క్లాసుల పేరిట పైన చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తిస్తూ... తల్లిదండ్రులకు చెప్పొద్దని బెదిరించేవారు.

కొంతకాల ఉపాధ్యాయులిద్దరి వేదింపులను భరించిన విద్యార్ధిణులు ఇటీవల వారి చేష్టలు మరీ మితిమీరడంతో తట్టుకోలేకపోయారు. దీంతో తల్లిదండ్రులకు విషయం తెలిపారు. ఈ క్రమంలోనే బాలికలు,  తల్లిదండ్రులు కలిసి ఉపాధ్యాయుల దుశ్చర్యలను ప్రస్తావిస్తూ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది. దీంతో విద్యాశాఖ మంత్రి ఆదేశాలతో ఈ కీచక టీచర్లను సస్పెండ్ చేయడమే కాదు వారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?