బాబుతో భేటీ.. టీడీపీలో ఆనం చేరికకు రంగం సిద్దం.. నెల్లూరులో కీలక పరిణామాలు..!!

By Sumanth KanukulaFirst Published Jun 10, 2023, 9:23 AM IST
Highlights

మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైంది.

నెల్లూరు: మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేశారనే ఆరోపణలపై ఆయనను ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు నుంచే అధికార వైసీపీ విధానాలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక, వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని మరింతగా పెంచారు. ఆయన టీడీపీలో చేరనున్నారనే ప్రచారం కూడా కొంతకాలంగా సాగుతుంది.

తాజాగా తన రాజకీయ భవిష్యత్తుపై ఆనం రామనారాయణరెడ్డి ఓ క్లారిటీకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం రోజున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును హైదరాబాద్‌లో కలిశారు. దాదాపు గంటకు పైగా వీరి సమావేశం జరిగింది. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి పలు అంశాలపై ఆనం రామనారాయణరెడ్డి ఈ సమావేశంలో చంద్రబాబుతో చర్చించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన టీడీపీలో చేరడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. 

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు చేరుకున్న ఆనం రామనారాయణరెడ్డి ఈరోజు ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. టీడీపీ నేత సోమిరెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులతో ఆయన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇందకోసం వారికి ఆహ్వానం కూడా పంపారు. వారితో కలిసే జిల్లా టీడీపీ కార్యాలయానికి కూడా వెళ్లనున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించే సమయంలో చేయాల్సిన స్వాగత ఏర్పాట్లపై కూడా చర్చించనున్నారు. 

అయితే ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరతారా?.. రాజీనామా చేయకుండా టీడీపీ కండువా కప్పుకుంటారా?(వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు కనుక రాజీనామా అవసరం లేదని భావిస్తారా?).. అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోకుండా ఆ పార్టీకి మద్దతుగా కొనసాగుతారా?.. అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే.. ఆనం రామనారాయణరెడ్డి కూతురు కైవల్యా రెడ్డి అత్తగారి కుటుంబం ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వారి కుటుంబం.. వైస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఉంది. బద్వేలు టీడీపీ మహిళా నేత విజయమ్మకు కైవల్యా రెడ్డి కోడలు. 
 

click me!