వివేకా హత్య వెనక పెద్ద కుట్ర... సీఎం జగన్ దంపతుల వైపే వేళ్లన్నీ..: వర్ల రామయ్య

By Arun Kumar PFirst Published Jun 9, 2023, 5:38 PM IST
Highlights

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసంటూ సిబిఐ చేసిన వ్యాఖ్యలపై వర్ల రాామయ్య స్పందించారు. 

విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వెనక పెద్ద కుట్ర దాగివుందని టిడిపి పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికారమంతా జగన్ చేతుల్లోనే వుంది... అయినా బాబాయ్ హత్యకేసులో నిందితులను పట్టుకోలేకపోతున్నారంటూ ఎద్దేవా చేసారు. వివేకా హత్యకేసులో జగన్ అడుగడుగునా అబద్దాలు ఆడుతున్నారని ఆరోపించారు. కాబట్టి బాబాయ్ హత్యతో అబ్బాయ్ కి ఏం సంబంధముందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం వుందని వర్ల రామయ్య పేర్కొన్నారు. 

సొంత బాబాయ్ హత్య జరిగిన సమయంలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ అబద్ధాలు ఆడారు... ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా అబద్ధాల పరంపర కొనసాగిస్తున్నారని రామయ్య అన్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని ఆలోచిస్తే బాబాయ్ ని చంపిన వ్యక్తులు ఆయనకు అత్యంత ఆప్తులని స్పష్టమవుతోందన్నారు. వారిని రక్షించడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని రామయ్య ఆరోపించారు. 

వివేకా హత్య కేసులో నిందితుల కోసం సీఎం జగన్ నానా తంటాలు పడుతున్నారని... ఆయన ఎక్కని మెట్లులేవు, మొక్కని దేవుడు లేడని రామయ్య అన్నారు. ఈ హత్యకేసుపై దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఇటీవల హైకోర్ట్ కు కీలక సమాచారం ఇచ్చిందని... వివేకాహత్య గురించి జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసుని చెప్పిందన్నారు. ఈ హత్యవెనుక పెద్ద కుట్ర దాగివుందని చెప్పిందన్నారు. స్వయంగా దర్యాప్తు సంస్థ సీబీఐ ఆరోపణలు చేస్తుంటే ముఖ్యమంత్రి ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇప్పటికీ తనకేమీ తెలియదన్నట్లు బుకాయించేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారని రామయ్య ఆరోపించారు. 

Read More  మేనిఫెస్టో ట్రైలర్ కే జగన్ కు చెమటలు... అసలు సినిమా ముందుంది : మాజీ మంత్రి సంచలనం

సీబీఐ చెప్పిన విశాలమైన కుట్ర ఏమిటో, వివేకాహత్య ఎందుకు జరిగిందో, దానివెనక ఎవరున్నారో తెలుసుకోవడానికి 5కోట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని రామయ్య అన్నారు. వివేకాహత్యతో మీకు ఎలాంటి సంబంధంలేదని చెప్పగలరా? అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. వివేకా హత్యకేసులో వేళ్లన్నీ మీ వైపు, మీ శ్రీమతివైపే చూపిస్తున్నాయని... ఇప్పటికైనా పెదవి విప్పి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని రామయ్య సూచించారు. 

వివేకాహత్యలో మీ ప్రమేయాన్ని సీబీఐ కోర్టు చెప్పాక కూడా జగన్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడమేనని రామయ్య అన్నారు. వివేకాహత్య కేసులో సీబీఐ విచారణపై ప్రజలు పెదవివిరుస్తున్నారని... ఈ కేసు విచారణను కడపలోని సబ్ ఇన్ స్పెక్టర్ కు అప్పగించి ఉంటే నిందితులంతా ఈపాటికే ఊచలు లెక్కపెడుతుండేవారు అని చెప్పుకుంటున్నారని అన్నారు. అవినాశ్ రెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తే పండగ చేసుకుంటారా? బెయిల్ వస్తే నిర్దోషులు అవుతారా? బాణసంచాకాల్చి స్వీట్లు తినిపించుకుంటారా? 11 కేసుల్లో మీరు బెయిల్ పై ఉన్నారు ముఖ్యమంత్రిగారు, వాటిలో మీకు బెయిల్ వస్తే మీరు నిర్దోషి అవుతారా? అని వర్ల రామయ్య ప్రశ్నలు సంధించారు.

click me!