
వైసీపీ బహిష్కృత నేత , వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాం నారాయణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఒక పార్టీ నేత మరో పార్టీపైనో, ప్రత్యర్ధులపైనో విమర్శలు చేస్తారని.. కానీ వైసీపీలో మాత్రం సొంత పార్టీకి చెందిన నేతలపై విమర్శలు చేస్తారని మండిపడ్డారు. ఇది నెల్లూరు రాజకీయ సంస్కృతి కాదని ఆనం అన్నారు. టికెట్ విషయంలో పోటీ వస్తారని భావించి.. నేతల కుటుంబాల్లోని మహిళల గురించి మాట్లాడటం సరికాదని రామ్ నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులని, ఎవరిని ఎక్కడ కట్టడి చేయాలో వారికి బాగా తెలుసునని ఆనం పేర్కొన్నారు.
అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వారాహి యాత్రపైనా రాం నారాయణ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను జనానికి వివరించేందుకే ఆయన యాత్ర చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో దోపిడి పాలనలో జరుగుతుందని .. త్వరలోనే దీనికి మూల్యం చెల్లించుకోవాలని ఆనం హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ వైపు తిప్పుకున్నారని.. మరి వారి చేత రాజీనామా చేయించారా అని రాం నారాయణ రెడ్డి ప్రశ్నించారు.
also read: దమ్ముంటే నాపై పోటీచెయ్ ఆనం... ఓడితే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా..: అనిల్ యాదవ్ సవాల్
ఏడాది అధికారం వున్నా.. తాను బయటకు వచ్చానని, చంద్రబాబు ఆదేశిస్తే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నా చేస్తానని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకునేముందు నెల్లూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తన మనసులోని మాటను రాం నారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరుతో మొదలైన తన రాజకీయం.. నెల్లూరుతో ముగించాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.