
కొత్త మంత్రివర్గంలో భూమా అఖిలప్రియ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబునాయుడు అఖిలకు మంత్రిపదవి ఎందుకు ఇచ్చారు? ఫిరాయింపుల్లో సీనియర్లుండగా అఖిలకే మంత్రిపదవి ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చింది? అనే ప్రశ్నలపై టిడిపిలో చర్చలు జరుగుతున్నాయ్. అయితే, ఈ ప్రశ్నలకు టిడిపి నేతలు కొందరు చెబుతున్న సమాధానాలు కూడా ఆశక్తిగా ఉన్నాయ్. మంత్రిపదవి హామీ ఇచ్చింది కూడా భూమా నాగిరెడ్డికి మాత్రమే.
భూమా పోయిన తర్వాత అఖిలకు మంత్రిపదవి ఇవ్వాలనేం లేదు. అయినా ఎందుకిచ్చారంటే పార్టీ నేతలు కొన్ని కారణాలను చెబుతున్నారు. ఒకటి: త్వరలో నంద్యాల అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. రెండు: ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిని అని చంద్రబాబు అందరితోనూ అనిపించుకోవటం. మూడు: భూమా మరణానికి తానే కారణమని జిల్లా టిడిపి నేతల్లో, భూమా వర్గంలో పడిన బలమైన ముద్రను చెరిపేసుకోవటం. నాలుగు: నంద్యాల సీటు నుండి భూమా కుటుంబాన్ని దూరంగా ఉంచటం. ఐదు: అఖిల తిరిగి వైసీపీలోకి వెళ్ళ కూడా చేయటం.
ఈ కారణాల వల్లే అఖిలకు చంద్రబాబు మంత్రిపదవి ఇచ్చినట్లు బాగా ప్రచారంలో ఉంది. భూమాను టిడిపిలోకి లాక్కున్న తర్వాత వివిధ కారణాల వల్ల భూమాకు మంత్రిపదవి ఇవ్వకూడదని చంద్రబాబు అనుకున్నారట. అందుకు గవర్నర్ పేరు కూడా వాడుకున్నారు. హామీ అమలు కోసమే చంద్రబాబుపై భూమా విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. సరే, వారిద్దరి మధ్య ఏం జరిగిందో స్పష్టంగా ఎవరికీ తెలీదు. కానీ హటాత్తుగా భూమా మరణించారు. విషయం తెలీగానే చంద్రబాబులో ఆందోళన మొదలైనట్లు సమాచారం.
ఎప్పుడైతే భూమా మరణించారో నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లోని భూమా అనుచరులు తమ నేత మరణానికి చంద్రబాబే కారణమంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు మొదలుపెట్టారు. చంద్రబాబు ఆందోళనకు అదే ప్రధాన కారణం. ఆ ముద్ర చెరిపేసుకోవాలంటే తక్షణమే అఖిలకు మంత్రిపదవి ఇవ్వటం ఒకటే మార్గమని టిడిపి అధినేత భావించారు. బహుశా బ్రతికుంటే భూమాకు మంత్రి పదవి ఇచ్చేవారు కాదేమో. అదేవిధంగా, అఖిలకు మంత్రిపదవి ఇచ్చారు కాబట్టి నంద్యాలలో పోటీ చేసే అవకాశం ఇతరులకు ఇవ్వలనే ఉద్దేశ్యంలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.
తండ్రి మరణం తర్వాత అఖిల తిరిగి వైసీపీలోకి వెళ్ళే అవకాశాలున్నాయన్న ప్రచారం మొదలైంది. నిజంగానే అఖిల గనుక వైసీపీలోకి తిరిగి వెళిపోతే చంద్రబాబుకు పెద్ద దెబ్బే. టిడిపిలో ఉన్నంత కాలం తన తండ్రిని చంద్రబాబు బాగా ఇబ్బందులు పెట్టారని గనుక అఖిల చెబితే రెండు నియోజకవర్గాల్లో టిడిపి కోలుకోలేందు. అన్నీ విషయాలను ఆలోచించిన తర్వాతే తప్పని పరిస్ధితుల్లో మాత్రమే అఖిలను చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.