
కేంద్రమంత్రి వెంకయ్యనాయడు మాటల్లో అసహనం నానాటికి పెరిగిపోతోంది. ప్రధానమంత్రిని మెప్పించి ప్రత్యేకహోదా సాధించలేక, తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రజలను మెప్పించలేక, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నిలువరించలేని చేతగాని తనం వెంకయ్య మాటల్లో స్పష్టంగా కనబడుతోంది. పైగా సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారేమోనని ఆందోళన. .
హోదా విషయంలో వెంకయ్య తాజాగా చేసిన వ్యాఖ్యలు విన్న వారు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో మాట్లాడుతూ, ప్రత్యేకహోదా అంశం ముగిసిన అధ్యాయమని తాజాగా వెంకయ్య శెలవిచ్చారు. అంత వరకూ బాగానే ఉంది. మరి ఆ తర్వాత మాట్లాడిన మాటలపైనే జనాలు ఆశ్చర్యపోతున్నారు.
నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేసినపుడు అప్పటి ప్రతిపక్షాలు ఏమి చేస్తున్నాయని ఘనత వహించిన వెంకయ్య తీవ్రంగా ప్రశ్నించారు. దానితోనే కేంద్రమంత్రి మన:స్ధితిపై అందరికీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ ను అడ్డుగోలుగా నాటి కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా చీల్చిందన్నది అందరికీ తెలిసింన సంగతే. అయిలే ఎలా చీల్చ గలిగింది? నాడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహకారంతోనే అన్న విషయం కూడా అందరికీ గుర్తుంది.
అడ్డుగోలు విభజనకు రాజ్యసభలో నాడు సంపూర్ణ సహకారం అందించింది వెంకయ్య నాయకత్వంలోని భాజపానే. ఇక, తెలుగుదేశం పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే, రాష్ట్ర విభజనకు మద్దతుగా మూడు సార్లు లేఖలు ఇచ్చింది చంద్రబాబే. పైగా రాష్ట్ర విభజన కోసం జరిగిన ఓటింగ్ లో తొలి ఓటు వేసింది కూడా నాటి టిడిపి ఎంపి నామా నాగేశ్వర్ రావే. ఇటు భాజపా, అటు టిడిపిలు కూడబలక్కుని నాటి కాంగ్రెస్ కు పూర్తి స్ధాయి మద్దతు ఇచ్చిన కారణంగానే యూపిఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డుగోలుగా చీల్చ గలిగింది.
నాడు యూపిఏ ప్రభుత్వం చేస్తోంది తప్పని తెలిసీ మద్దతు ఇచ్చిన టిడిపి, భాజపాలు ఆ తర్వాత పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాయి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రత్యేకహోదా విషయంలో పై రెండు పార్టీలు చేసిన విన్యాసాలు అందరూ చూస్తూనే ఉన్నారు. రాష్ట్రాన్ని ఏకపక్షంగా అడ్డుగోలుగా చీల్చిందన్న కోపంతోనే 2014 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను బాగానే సత్కరించారు. మరి, వెంకయ్య వచ్చే ఎన్నికల్లో భాజపాకు అదే సత్కారాన్ని కోరుకుంటున్నారేమోనని రాష్ట్రంలోని కమలనాధులే అనుమానిస్తున్నారు.