అదే జరిగితే జగన్ మంత్రివర్గం సగం ఖాళీ...ఎమ్మెల్యేలు కూడా: వర్ల సంచలనం

By Arun Kumar PFirst Published Sep 21, 2020, 9:58 PM IST
Highlights

2007-2010 మధ్యన రూ.5వేలకోట్ల విలువైన లక్షా40టన్నుల ఇనుప ఖనిజాన్ని (ఐరన్ ఓర్) ఆర్.ఆర్.గ్లోబల్ కంపెనీపేరుతో సజ్జల, ఆయన సోదరుడు దోచేశారని రామయ్య ఆరోపించారు. 

విజయవాడ: తానేదో సచ్ఛీలుడైనట్లు తగుదనమ్మా అంటూ మీడియా ముందుకొచ్చి నిర్లజ్జగా మాట్లాడటం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అలవాటైందని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. అయితే ఆయన బాగోతం గురించి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. 

2007-2010 మధ్యన రూ.5వేలకోట్ల విలువైన లక్షా40టన్నుల ఇనుప ఖనిజాన్ని (ఐరన్ ఓర్) ఆర్.ఆర్.గ్లోబల్ కంపెనీపేరుతో సజ్జల, ఆయన సోదరుడు దోచేశారని రామయ్య తెలిపారు. అనంతపురం జిల్లాలో సుంకులమ్మ దేవాలయాన్ని ఏవిధంగా ధ్వంసం చేశారో, అమ్మవారి బంగారం వ్యవహారం కూడా త్వరలోనే బయటపడుతుందని వర్ల స్పష్టం చేశారు. సజ్జల గౌరవప్రదమైన వ్యక్తి కాదని, ఆయన అవినీతి గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నారు. 

సజ్జల రాష్ట్రానికి అపర హోంమంత్రి అని, ఆయనకు ఏం తెలుసని అమరావతి గురించి మాట్లాడుతున్నాడో చెప్పాలన్నారు. అమరావతిలో ఏమీ జరగలేదని మంత్రుల సబ్ కమిటీ చెప్పిందని... అయినా చంద్రబాబు అవినీతిని బయటకు తీస్తే బహుమతులిస్తానని ముఖ్యమంత్రి అధికారులను ప్రలోభపెట్టలేదా? అని వర్ల ప్రశ్నించారు. లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న సజ్జల, ఉదయం లేస్తే, చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు ఎలా చేయాలనే ఆలోచనలే చేస్తుంటాడన్నారు. రామకృష్ణారెడ్డి ఇప్పటికీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నట్లుగా రోజూ మాట్లాడుతున్నాడన్నారు. 

ఢిల్లీలో వైసీపీ ఎంపీలు సీబీఐ విచారణ వేయాలని ప్లకార్డులు పట్టుకొని నిరసనలు చేయడం సిగ్గుచేటని వర్ల మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు సీబీఐ విచారణ అంటూ రోడ్లెక్కడం ఏమిటన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ధైర్యముంటే, అమరావతి భూములు సహా, విశాఖపట్నం భూములు, ఇళ్లపట్టాలపేరుతో ప్రభుత్వం సాగించిన భూమాఫియాపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. దానితో పాటే ఇసుకమాఫియా, లిక్కర్, మైనింగ్ అంశాల్లోని గుట్టుమట్లను కూడా తేల్చాలని వర్ల డిమాండ్ చేశారు.  

read more   

విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి, ఆయన బృందం సాగించిన భూదందాపై నిజానిజాలు తేల్చే దమ్ము, ధైర్యం వైసీపీ ప్రభుత్వానికి, సజ్జలకు ఉన్నాయా? అని వర్ల ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇసుకపాలసీ తీసుకురాగానే, ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త లారీలు కొన్నారో సజ్జలకు తెలుసా అన్నారు. మంత్రులంతా సచివాలయం వదిలేసి ఆటోనగర్ లో కూర్చొని లారీలకు బాడీలు కట్టించుకుంటున్నారని వర్ల ఎద్దేవా చేశారు. సజ్జల తనతో చెన్నై వస్తే మంత్రులు-వారి లారీలు అనే సినిమాను కళ్లకు కట్టినట్లు చూపిస్తానని రామయ్య తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న లిక్కర్ దందాపై కూడా సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఊరికే పొద్దున లేచిన దగ్గరనుంచీ సీబీఐ, సీబీఐ అంటున్న సజ్జల తాను చెప్పిన అంశాలపై విచారణ జరిపిస్తే సీబీఐ వైసీపీ ప్రభుత్వం బెండు తీయడం ఖాయమని వర్ల దెప్పిపొడిచారు. తమ మద్యం అమ్మకాలకు ఎక్కడ చిల్లుపడుతుందోనన్న భయంతోనే ఏపీ ప్రభుత్వం తెలంగాణకు బస్సులు నడపడం లేదన్నారు. ఏపీలోని మద్యం ప్రియులు తెలంగాణకు వెళ్లి, మందుసీసాలు తెచ్చుకుంటారన్న భయంతోనే జగన్ ప్రభుత్వం బస్సు సర్వీసులకు మోకాలడ్డుతోందన్నారు. తమ కమీషన్లు, తమ మందు దుకాణాలు ఏమైపోతాయోనన్న ఆందోళన తన ప్రభుత్వానికి ఉందో, లేదో సజ్జలే చెప్పాలన్నారు. ఇన్ని దారుణాలు చేస్తూ వీటి గురించి మాట్లాడకుండా... మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ప్రశ్నించే ధైర్యం చేయకుండా సజ్జల  ప్రతిపక్షంపై బురదజల్లాలని చూస్తున్నాడన్నారు.  

వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అక్రమ మైనింగ్ వల్ల ప్రకృతి విలపిస్తోందన్న రామయ్య మైనింగ్ లో ఎదగడానికి సైకిల్ కొనలేనివాడు కూడా ఈ ప్రభుత్వ అండతో లారీలు కొంటున్నాడన్నారు. జగన్, విజయసాయి రెడ్డి రెండు కళ్లలోని దూలాలను పట్టించుకోని సజ్జల చంద్రబాబు కంటిలోని నలుసు వెతికే ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. తాను చెప్పిన అంశాలపై తన ప్రభుత్వంతో సజ్జల సీబీఐ విచారణ జరిపిస్తే కేబినెట్ లో మూడో వంతు ఖాళీ అవుతుందని, ఎమ్మెల్యేలు సగంమంది జైలుకు వెళ్తారని రామయ్య ఎద్దేవా చేశారు. 

ప్రజలు అధికారమిస్తే ప్రజాస్వామ్యయుతంగా పాలనచేయడం చేతగాక అమరావతి ఆడబిడ్డలను వేధింపులకు గురిచేయడం, చంద్రబాబు, ఆయన కుటుంబంపై  కక్షసాధింపులకు పాల్పడటం చేస్తున్నారన్నారు. ఛీటింగ్ కేసుల్లో, ఫోర్జరీ నేరాల్లో, అవినీతి వ్యవహారాల్లో జైలుకెళ్లిన వారంతా తమనేరాలు కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారిపై నిందలు వేస్తున్నారన్నారు. విజయసాయిరెడ్డి అవినీతి గురించి రాజ్యసభలో మాట్లాడటం చూసి ఆనంద్ శర్మ ఏమన్నారో సజ్జలకు తెలియదా? అన్నారు. పెద్దలసభలో విజయసాయి రెడ్డి లాంటివారు అవినీతి గురించి మాట్లాడటం, ఈసభకు పట్టిన దౌర్భాగ్యమని ఆనంద్ శర్మ అన్నది నిజంకాదా? అని రామయ్య నిలదీశారు. అటువంటి వ్యక్తులు చంద్రబాబు గురించి, అమరావతి గురించి మాట్లాడమేంటన్నారు. 

అమరావతి భూములు, విశాఖపట్నం భూదందా, ఇళ్లపట్టాలపేరుతో సాగించిన దోపిడీ,  లారీల కొనుగోలు, ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియాలపై వైసీపీ ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపిస్తే తమ అధినేతపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై తాము కూడా సీబీఐ విచారణకు అంగీకరిస్తామని వర్ల తేల్చి చెప్పారు. తాను విసిరిన సవాల్ పై స్పందించే దమ్ము, ధైర్యం సజ్జలకు ఉంటే తక్షణమే జగన్ ను ఒప్పించి, సీబీఐ విచారణ కోరేలా చేయాలన్నారు.


 

click me!