మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామే కాదనలేదు...మరి జగన్ ఎందుకిలా: సోమిరెడ్డి

By Arun Kumar PFirst Published Sep 21, 2020, 8:57 PM IST
Highlights

ఏపీలో హిందూ దేవాలయాల విషయంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు దురదృష్టకరమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 

అమరావతి: కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మంచి మనస్సుతో తీసుకోవాలంటే తిరుమల కొండపై ఆచారాన్ని గౌరవించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. ఏపీలో హిందూ దేవాలయాల విషయంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు దురదృష్టకరమన్నారు. అలాంటి వాటిని ప్రోత్సహించేలా కొందరు మంత్రులు మాట్లాడటం దారుణమని... ఆంజనేయస్వామి విగ్రహం చెయ్యి విరిగితే వచ్చిన నష్టమేంటి... దుర్గమ్మ రథంలో విగ్రహాలు పోతే ఏమయింది కొత్తవి తెస్తామనడం... తిరుమల డిక్లరేషన్ పై సంతకం అవసరం ఏంటి అనే వ్యాఖ్యలు సాక్షాత్తు ఓ మంత్రి చేయడం తగదని సోమిరెడ్డి అన్నారు. 

''ఎన్నో దశాబ్దాలుగా అన్ని మతాల వాళ్లం కలిసిమెలసి బతుకున్నాం. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవడం అలవాటుగా మార్చుకున్నాం. తిరుమలలో హిందూయేతరులు డిక్లరేషన్ లో సంతకం పెట్టే సంప్రదాయం అనాదిగా వస్తోంది. అప్పట్లో సాక్షాత్తు రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ కేసీ అబ్రహం కూడా డిక్లరేషన్ లో సంతకం పెట్టారు. సోనియా గాంధీ, రాజశేఖర్ రెడ్డి సంతకం పెట్టలేదంటే అది ఖచ్చితంగా ఉల్లంఘనే...వారు చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఉల్లంఘిస్తామనడం సరికాదు'' అని పేర్కొన్నారు. 

''తిరుమల ఒక్క ఏపీకే పరిమితమైన ఆలయం కాదు... ప్రపంచంలోనే ప్రముఖ దేవాలయం. వాటికన్ సిటీ కన్నా ఎక్కువ మంది భక్తులొచ్చే ఆలయం తిరుమల. కేరళలోని త్రివేండ్రం అనంత పద్మనాభ స్వామి దేవస్థానంలో ప్రవేశానికి షర్టు లేకుంటేనే అనుమతిస్తారు. ఇప్పుడు ఏపీలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వారు పద్మనాభస్వామి ఆలయంలోకి షర్టు ధరించి వెళ్లగలరా..?'' అని సవాల్ విసిరారు.

read more  హిందూ దేవాలయాలపై ఆగని దాడులు...ఈసారి కాలభైరవ విగ్రహం ధ్వంసం

''గురువాయూరు ఆలయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో హిందూయేతరులను ఆలయంలోకి అనుమతించరు. హజ్ యాత్రలో భాగంగా మక్కాకి వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ ముస్లిం అని డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. అది ముస్లింల ఆచారం. శబరిమల అయ్యప్పగుడిలో యుక్తవయస్సు మహిళలను అనుమతించరు. అది ఆ ఆలయ ఆచారం'' అని వివరించారు. 

''తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అన్ని మతాలను గౌరవించుకున్నాం... ముస్లింలకు రంజాన్ తోఫా, హిందువులు, క్రైస్తవులకు సంక్రాంతి, క్రిస్మస్ కానుకలిచ్చుకున్నాం. ఈ రోజుకీ పీర్ల పండగలో అందరం కలసిమెలసి పాల్గొంటాం. అన్ని ఆలయాలు, దర్గాలు, చర్చిలకు మతాలకు అతీతంగా అందరం వెళ్లడం... కలిసి ప్రార్ధనలు పూజలు చేసుకుని ఒకరినొకరం గౌరవించుకునే సంప్రదాయం ఏపీలో ఉంది'' అన్నారు. 

''నాలుగైదు పుణ్యక్షేత్రాల్లో అనాదిగా వస్తున్న ఆచారాలను ఉల్లంఘించడానికి మీరెవరు. గతంలో ఏమైనా పొరపాట్లు జరిగివుంటే సరిదిద్దాల్సిందిపోయి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం సరికాదు. సీఎం జగన్మోహన్ రెడ్డికి నాది ఒకటే విజ్ఞప్తి. ఏడుకొండల వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు మంచి మనస్సుతో తీసుకునేటప్పుడు అక్కడి ఆచారాలను కూడా గౌరవించాలని మరోసారి కోరుకుంటున్నా'' అని సోమిరెడ్డి సూచించారు. 

click me!