సేమ్ టు సేమ్...ఆనాడు ఇందిరాగాంధీ, నేడు జగన్: వర్ల రామయ్య సంచలనం

By Arun Kumar PFirst Published Jun 25, 2020, 7:57 PM IST
Highlights

జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. 

విజయవాడ: జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. ప్రజావేదికను స్క్రాప్ గా మార్చి రూ. 11 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని... అదే ఇప్పుడు ఉండి ఉంటే క్వారంటైన్ సెంటర్ గా అయినా ప్రజలకు ఉపయోగపడి ఉండేదన్నారు. 69 సార్లు కోర్టులు చీవాట్లు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని రామయ్య మండిపడ్డారు.  

''దేశంలో సరిగా 45 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ విధించబడింది. పార్లమెంట్ సభ్యురాలిగా ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 25న తీర్పునివ్వడంతో ఎమర్జెన్సీని విధించారు. నాడు పౌర హక్కులన్నీ తొలగించబడ్డాయి. రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులన్నీ రద్దయ్యాయి. పత్రికల మీద ఇనుప పాదం మోపబడింది. ప్రతిపక్షాల నోరు నొక్కబడింది. గొంతెత్తుతారని అనుమనించిన వారినంతా అక్రమ అరెస్ట్ లు చేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి, ఎల్ కే అద్వానీ, మధు దండావతె, ప్రమీల దండావతె, జార్జి ఫెర్నాండేజ్, వెంకయ్యనాయుడు, దేవీలాల్, మోరార్జీ దేశాయ్ ఇలా ఎంతోమంది ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ లు చేశారు. ఎందుకు అరెస్టులు చేశారని అడగడానికి లేకుండా నిరంకుశ, అరాచక పాలన సాగించారు. 21 నెలల పాటు నాడు ఎమర్జెన్సీ నడిచింది. 400 సీట్లు గెలుస్తారని ఇంటిలెజెన్స్ వర్గాలు చెపితే చివరకు ఇందిరాగాంధీ కేవలం 34 మాత్రమే గెలిచారు. కారణం నిరంకుశ పాలనను ప్రజలు తిరస్కరించమే'' అని రామయ్య గుర్తుచేశారు. 

Latest Videos

''జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో కూడా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ఏడాది క్రితం అక్రమ కట్టడమనే నెపంతో ప్రజావేదికను కూల్చివేసి రూ. 11 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ప్రజావేదిక నిర్మాణాన్ని విప్పదీసి అలాగే ఇంకోచోట నిర్మించుకునే అవకాశం ఉన్నప్పటికీ కక్షపూరితంగా కూల్చివేసి స్క్రాప్ కింద మార్చేశారు. దీనిని బట్టి ముఖ్యమంత్రికి ముందుచూపు లేదని మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు తిరిగిన చోట తాను తిరగకూడదనే ఉద్దేశంతోనే దుర్మార్గంగా ప్రజావేదికను కూల్చివేశారు'' అని అన్నారు. 

read more  అచ్చెన్నాయుడు అప్రూవర్ గా మారితే...రేపు చంద్రబాబు, లోకేష్ జైలుకే: జోగి రమేష్

''అస్తమానం ప్రజావేదికను అక్రమ కట్టడమని విమర్శించారే తప్ప దానిని ఏవిధంగా సక్రమం చేద్దామనే దానిపై దృష్టి పెట్టలేకపోయారు. ప్రజావేదిక ఉండి ఉంటే  ఇవాళ క్వారంటైన్ సెంటర్ గా అయినా ప్రజలకు ఉపయోగపడి ఉండేది. చివరకు కూల్చివేయబడ్డ ప్రజావేదిక శిథిలాలను పరిశీలించడానికి వెళ్లిన టీడీపీ నాయకులు, పాత్రికేయ మిత్రులను.. ఎమర్జెన్సీని తలపించే విధంగా చుట్టుముట్టారు. ప్రజావేదికను కాకపోయినా పక్కనే ఉన్న చంద్రబాబు నివాసానికి వెళతామన్న పోలీసులు వినలేదు. దీనినిబట్టి చూస్తే 45 ఏళ్లు క్రితం దేశంలో ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీకి... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధించిన అప్రకటిత ఎమర్జెన్సీకి పెద్ద తేడా లేదనిపిస్తోంది. నాడు బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తే.. నేడు టీడీపీ నాయకులను అరెస్ట్ చేశారు'' అని పేర్కొన్నారు.

''జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు చంద్రబాబు అన్ని రకాల పర్మిషన్ లు ఇచ్చి బందోబస్తు కల్పిస్తే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబును ఏ ఊరు వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. పల్నాడులో 200 దళిత కుటుంబాలు వైకాపా దౌర్జన్యాలకు బయపడి ఊరు వదిలి వెళ్లిపోతే.. వారిని తిరిగి స్వగ్రామానికి పంపేందుకు ముందుకొచ్చిన చంద్రబాబుని అడ్డుకున్నారు. ఆయన ఇంటికి తాళ్లను బిగించారు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కాదా..? పర్మిషన్ తీసుకుని విశాఖ పర్యటనకు వెళితే.. అక్కడ కూడా అడ్డంకులు సృష్టించి వెనక్కి పంపించారు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కాదా..?'' అని నిలదీశారు. 

''1975 లో పత్రికలపై ఇందిరాగాంధీ ఆంక్షలు విధిస్తే ఇప్పుడు జీవో 2430 ద్వారా మీడియా గొంతు నొక్కుతున్నారు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ కాదా..? నాడు ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు నోటీసులు ఇస్తే... నేడు ఈనాడుకు నోటీసులు ఇస్తున్నారు. రూ. 3 కోట్ల రూపాయల అవినీతి కేసులో ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడిపై అక్రమ కేసు పెట్టి ఈరకంగా వేధిస్తున్నారు. మరి రూ.43 వేల కోట్లు కొట్టేసిన వారిని ఏం చేయాలి..? అచ్చెన్నాయుడు ఇంటికి వందల మంది పోలీసులు వెళితే.. రూ. 43 కోట్ల కొట్టేసిన వారి ఇంటికి ఎంత మంది పోలీసులు వెళ్లాలి..?'' అని ప్రశ్నించారు. 

''ఒక బండిపోటు, టెర్రరిస్టు మాదిరిగా అచ్చెన్నాయుడిని ట్రీట్ చేస్తారా..? 69 సార్లు చీవాట్లు పెట్టి పెట్టి కోర్టుల ఓపిక నశిస్తుందే తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి చలనం లేదు. టీడీపీ నాయకులు, మహిళ నేతలపై అసభ్యకరంగా పోస్టింగులు పెడుతున్నారని ఫిర్యాదులు చేస్తే.. కనీసం ఒక్కరిని అయినా అరెస్ట్ చేశారా..? కానీ ఒక పోస్ట్ ని ఫార్వర్డ్ చేశారనే అభియోగంతో నలంద కిషోర్ ను అక్రమ అరెస్ట్ చేశారు. పోస్ట్ రాసిన వ్యక్తిని వదిలిపెట్టి.. 70 ఏళ్ల నలంద కిషోర్ ను కర్నూలు కోవిడ్ ఆస్పత్రికి బలవంతంగా తీసుకెళ్లారు. ఆయనకు కరోనా అంటించాలని చూస్తున్నారా..? విశాఖ ప్రజలు కూడా పోస్టింగ్ లోని కంత్రీ మంత్రీ ఎవరో ప్రభుత్వాన్ని నిలదీయవలసింది'' అని సూచించారు. 

''విశాఖ ప్రజలు సౌమ్యంగా ఉంటే.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. ఎర్రన్నాయుడు కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత కక్ష..? మీపై పిటిషన్ వేశారనా..? 16 జైలు జీవితం గడపడానికి కారణమనా..? ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కోర్టుల చుట్టూ తిరగడానికి ఆయన వేసిన కేసులే కారణమనా..? అచ్చెన్నాయుడి గాయం కూడా మానకుండా ఇబ్బందులు పడుతుంటే.. బలవంతంగా డిశ్చార్జి రిపోర్టు ఎందుకు రాయించారు..? ఆస్పత్రిలోనే ఎగ్జామిన్ చేయమని కోర్టు చెప్పినా.. పెడచెవిన పెట్టారు. వీటన్నింటి చూస్తే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని స్పష్టమవుతోంది. దయచేసి పౌరహక్కులను కాలరాయవద్దని ముఖ్యమంత్రిని వేడుకుంటున్నాను'' అని అన్నారు రామయ్య. 

click me!