ఆ హక్కు గవర్నర్ ది కాదు...మరి ఎవరిదంటే..: వర్ల రామయ్య

By Arun Kumar PFirst Published Jul 21, 2020, 12:04 PM IST
Highlights

సీఆర్డీఎ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులను ఆమోదించే అధికారం కేంద్ర ప్రభుత్వానికే వుందని టిడిపి నాయకులు వర్ల రామయ్య తెలిపారు. 

విజయవాడ: సీఆర్డీఎ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆమోదం కోసం గవర్నర్ కు పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లులను ఆమోదించే అధికారం కేంద్రానికే వుందని... నిబంధనలకు విరుద్దంగా వైసిపి ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం ఈ బిల్లులను పంపించడం ఏంటని ప్రశ్నించారు. 

''ముఖ్యమంత్రి గారూ! పాలన వికేంద్రీ కరణ, సిఆర్డిఎ రద్దు బిల్లుల ఆమోదం తెలిపే హక్కు కేంద్రానికే వుంది. దీనిపై పట్టుదలకు పోకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపై ద్వేషంతో రాజధానిని తరలించడం చరిత్ర క్షమించదు. ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తగవు. అవునా?'' అంటూ రామయ్య ట్వీట్ చేశారు. 

read more   పదే పదే అవే పొరపాట్లు: బాబుపై తెలుగు తమ్ముళ్ల ఫిర్యాదు ఇదే....

విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని, అమరావతిలో అసెంబ్లీ క్యాపిటల్ ను, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదం తెలిపితే సీఆర్డీఎ రద్దు కావడంతో పాటు మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో   గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో వర్ల  రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 

శాసనసభ ఆమోదించిన బిల్లులకు శాసన మండలిలో అడ్డంకులు ఏర్పడ్డాయి. శాసన మండలిలో బిల్లులు పెట్టిన గడువు ఈ నెల 17వ తేదీతో గడిచింది. నెల రోజులు గడిచినందున ఆ రెండు బిల్లులను ప్రభుత్వాధికారులు ఆమోదం కోసం గవర్నర్ కు పంపించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ చోటు చేసుకుంది.  

మూడు రాజధానుల ఏర్పాటు చట్టప్రకారం సాధ్యం కాదని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా అభిప్రాయపడ్డారు. రాజధాని ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని ఆయన అన్నారు. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ సిఫార్సుల మేరకు రాజధాని ఏర్పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉందని ఆయన అన్నారు. 

అందుకు అనుగుణంగా అప్పటి ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంచుకుందని చెప్పారు. విభజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉందని, రాజధానులు అని లేదని, వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే విభజన చట్టంలో సవరణలు అవసరమని ఆయన అన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గవర్నర్ వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

వివాదాస్పద బిల్లులపై భిన్నాభిప్రాయులు ఉన్నందు వల్లనే కేంద్రం సలహా తీసుకోవాలని తాము కోరినట్లు ఆయన తెలిపారు. చట్టం అయిందని ప్రభుత్వం ఒక్కసారి భావించిన తర్వాత అది రాష్ట్రపతికి పంపించాలా, లేదా న్యాయ సలహా కోరాలా అనేది గవర్నర్ ఇష్టమని ఆయన అన్నారు.

పరిపాలనా వికేంద్రమరణ, సీఆర్డిఏ బిల్లులు ఇంకా పెండింగులోనే ఉన్నాయని, ప్రజలకు సంబంధించిన బిల్లులకు శాసన మండలి ఆమోదం లేదా తిరస్కరణ లభించలేదని ఆయన గుర్తు చేశారు. ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ఆయన అడిగారు. సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగులో ఉన్న బిల్లులను మళ్లీ సభ ముందుకు తేవడం తగదని ఆయన అన్నారు. 
  

click me!