
కృష్ణా జిల్లా నున్నలో దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన తనయుడు వంగవీటి రాధా, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఎంపీ బాలశౌరీలు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ప్రాణమిత్రులంతా ఒకే వేదికపైకి రావడంతో బెజవాడ రాజకీయాల్లో కలకలం రేగింది. ఈ సందర్భగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతం కోసం వ్యవస్థను ఎదిరించిన వ్యక్తి వంగవీటి రంగా అని కొనియాడారు . రంగా శత్రువులు టీడీపీలో చేరి ఆయన్ను హత్య చేశారని ఆరోపించారు.
రంగాను ఎదుర్కొలేక భూమి మీద లేకుండా చేయాలని కుట్ర పన్ని హత్య చేశారని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగాను హతమార్చిన వారు ప్రస్తుతం ఏ దుస్ధితిలో వున్నారో తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యసభ సీటు లాంటి పదవులిస్తామన్నా వంగవీటి రాధా లొంగడన్నారు. రాధాకు స్వార్ధం లేదని.. తండ్రి పేరు నిలబెట్టడమే రాధాకు ముఖ్యమని కొడాలి నాని ప్రశంసించారు. రంగా మరణించినప్పటికీ ప్రజల గుండెల్లోనే వుంటారని ఆయన అన్నారు.
ALso REad: వంగవీటి రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ, త్వరలో జనసేనలోకి రంగా తనయుడు ...?
వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. వంగవీటి రంగా రాజకీయాల్లో వున్నప్పుడు తాము చిన్నవాళ్లమన్నారు. రంగా పేదల మనిషిని ఆయన కొనియాడారు. మూడేళ్లు మాత్రమే ఎమ్మెల్యేగా వున్నప్పటికీ రంగా ఎంతో ఖ్యాతి సంపాదించారని వంశీ ప్రశంసించారు. ఆయన చనిపోయి 35 ఏళ్లైనా ప్రజల్లో జీవించి వున్నారని పేర్కొన్నారు. తండ్రి బాటలోనే రాధా పయనిస్తున్నారని వల్లభనేని వంశీ ప్రశంసించారు. వంగవీటి రాధా మాట్లాడుతూ.. రంగా ఓ ప్రాంతానికో, కులానికో, పార్టీలకో పరిమితం కాలేదన్నారు. ఎన్నేళ్లు పదవిలో వున్నామని కాదు, ప్రజల గుండెల్లో నిలవడమే ముఖ్యమని రాధా వ్యాఖ్యానించారు. పదవులు ఐదేళ్లే వుంటాయని.. కానీ రంగా గారి అబ్బాయి అనేదే తనకు పెద్ద పదవి అని ఆయన అన్నారు.