వంగా గీత: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

By Rajesh KarampooriFirst Published Mar 26, 2024, 11:26 PM IST
Highlights

Vanga Geetha Biography: ఆమెది దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర. పార్టీ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా విజయం ఆమె సొంతం. ఏ విషయం ఏదైనా.. వేదిక ఏదైనా.. అనర్గంగా మాట్లాడే నాయకురాలు. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని భావించే సామాజిక కార్యకర్త. ఆమెనే వైసీపీ నాయకురాలు, ఎంపీ వంగా గీత. రానున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పై వైసీపీ తరఫున పోటీ చేయడానికి సిద్దమైన వంగా గీత వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం మీ కోసం..  

Vanga Geetha Biography:

బాల్యం,  విద్యాభ్యాసం

వంగా గీత..  మార్చి 1 1964న ప్రకాశరావు - భ్రమరాంబ దంపతులకు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. ఆమె తండ్రి ప్రకాశరావు ప్రభుత్వ ఉద్యోగి. ఆమె తాతగారు స్వాతంత్ర్య సమరయోధుడు. ఆమెకు చిన్నతనంలోనే తమ సమీప బంధువు వంగా కాశీ విశ్వనాథ్ గారితో వివాహం జరిగింది.పెళ్లి అయిన తర్వాత భర్త ప్రోత్సహంతో ఆమె ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆమె ఆంధ్రా యూనివర్శిటీలోని GSK కాలేజీ లో బీఎల్ (BL) పూర్తి చేశారు. ఆ తరువాత నాగ్‌పూర్ యూనివర్సాలిటీ నుండి మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేశారు.ఆ తరువాత కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. ఆమె పొలిటికల్ సైన్స్,పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా. గీత అందుకే అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఉంటుంది.

రాజకీయ ప్రస్థానం 

వంగా గీత రాజకీయ ప్రస్థానం విద్యార్థి నాయకురాలిగా ప్రారంభమైందని చెప్పాలి. ఆమె డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రోజుల్లోనే విద్యార్థుల సమస్యలపై పోరాడేవారు. ఆమె స్టూడెంట్ లీడర్ గా కూడా పనిచేశారు. ఆమె రాజకీయ అవగాహన, పరిణతికి ముద్గుడైనా తన భర్త వంగా కాశీ విశ్వనాథ్.. ఆమెకు ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. అలా ఆయన కోరిక మీదకు 1983లో తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు వంగా గీత.  

ఆమె 1985 నుంచి 87 వరకూ తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మహిళా, శిశు సంక్షేమ రీజనల్‌ చైర్‌ పర్సన్‌గా, 1995లో కొత్తపేట జెడ్పీటీసీగా, 1995 నుంచి 2000 వరకూ తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్‌ పర్సన్‌గా పని చేశారు. ఇక 1997లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి ఉపాధ్యక్షురాలయ్యారు. ఆ తరువాత 2000 నుంచి 2006 వరకు టిడిపి తరఫున రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఈ తరుణంలోనే (2000-2006 మధ్యకాలంలో)అలాగే.. రవాణా, పర్యటకం, కమిటీ ఆన్ రూల్స్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వంటి విభిన్న కమిటీలలో సభ్యురాలిగా పనిచేశారు.

ప్రజారాజ్యంలో చేరిక 

ఆ తర్వాత తలెత్తిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో 2008లో చేరారు. ఆ తర్వాత చిరంజీవి ఆమెకు 2009 ఎన్నికల్లో పిఠాపురం టికెట్ ఇవ్వడంతో  ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె పిఠాపురం ఎమ్మెల్యేగా పిఆర్పి తరఫున గెలిచారు. 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేస్తారు. ఆ తర్వాత పిఆర్పి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వడంతో కొంతకాలం కాంగ్రెస్ లోనే కొనసాగారు. కానీ, 2014లో జరిగిన ఏపీ విభజనను ఆమె వ్యతిరేకిస్తూ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

వైసీపీలో చేరిక

సుధీర్ఘ విరామం తరువాత వంగ గీత  2019 మార్చిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసి 25738 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమెను 2019లో హోమ్ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యురాలుగా, మహిళా సాధికారత కమిటీ కమిటీ సభ్యురాలుగా నియమించారు. ఆమె ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశారు.  కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆమె మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 

అలాగే.. విశ్వగీతగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వంగ గీత. బాలికలకు హాస్టల్స్ సౌకర్యం వసతి కల్పించడం, పేదలకు సహాయం చేయడం వంటి పలు సేవ కార్యక్రమాలను ఆమె చేపట్టారు.  ప్రస్తుతం 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఆమె వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలుస్తున్నారు. జనసేన బీజేపీ టిడిపి కూటమి తరఫున జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఎంతోకాలంగా వంగా గీత కుటుంబం పిఠాపురం కాకినాడ పార్లమెంటు వేదికగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో వేచిచూడాలి. 
 

click me!