గుంటూరు ఘటనపై చంద్రబాబు దిగ్బ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ రూ.20 లక్షల పరిహారం..

By Rajesh KarampooriFirst Published Jan 2, 2023, 12:16 AM IST
Highlights

గుంటూరులో జరిగిన తొక్కిసలాట సంఘటన పై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని  ప్రకటించారు. అలాగే..బాధిత కుటుంబాలకు ఉయ్యూరు ఛారిటబుల్ ట్రస్ట్ 20 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. అదే సమయంలో క్షతగాత్రులకు అయ్యే ఖర్చు మొత్తం తామే భరిస్తామని ప్రకటించింది. 

గుంటూరులో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ నిర్వహించిన పేదలకు కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయారు. రమాదేవి అనే మహిళ సంఘటన స్థలంలోనే మరణించగా, రాజ్యలక్ష్మి, సయ్యద్ ఆసిమా అనే మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేదలకు కానుకలు ఇచ్చేందుకు ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో తాను పాల్గొన్నానని చంద్రబాబు నాయుడు చెప్పారు. కార్యక్రమం ముగిసి తాను వెళ్లిన అనంతరం జరిగిన ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరం అని చంద్రబాబు అన్నారు.

పేదలకు ఆ స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి అనే ఆలోచనతో తాను  కార్యక్రమానికి వెళ్లానని చంద్రబాబు అన్నారు.పేదల ఇళ్లలో జరిగిన ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని, ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

రూ.20 లక్షల పరిహారం

ఈ నేపథ్యంలో..ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉయ్యూరు శ్రీనివాసరావు స్పందించారు. నూతన సంవత్సర సందర్భంగా పేదప్రజలకు సాయం చేయాలనే సదుద్దేశంతో ఉయ్యూరు ఫౌండేషన్ జనతా వస్త్రాలు, నిత్యావసరాల పంపిణీ చేయాలని తలపెట్టామని తెలిపారు. గత ఏడాది కాలంగా గుంటూరు లో రెండు, హిందూపూర్ లో ఒకటి అన్న క్యాంటీన్ ను ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహిస్తున్నదనీ తెలిపారు.

అదే క్రమంలో పేద ప్రజల కోసం ఏదైనా చేయాలనే తలంపుతో కానుకల పంపిణీ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. తన సంస్థ ఆహ్వానాన్ని మన్నించి టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు వచ్చి పేదలకు శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోయారనీ, చంద్రబాబు గారు వెళ్లిపోయిన అనంతరం పేదలకు జనతా వస్త్రాలు, నిత్యావసరాలు పంపిణీ ప్రారంభించామని తెలిపారు.

నిబంధనల ప్రకారం అన్నిరకాల అనుమతులు తీసుకొని ఎవరికీ అసౌకర్యం కలగని రీతిలో ఏర్పాట్లు చేశామనీ, అయితే..  ముందుగా టోకెన్ లు జారీ చేసిన వారికంటే ఎక్కవ మంది ఒక్కసారిగా లోపలకు రావటంతో ఈ అపశృతి చోటుచేసుకున్నదని వివరించారు. ఈ దుర్ఘటనకు పూర్తి నైతిక బాధ్యత ఉయ్యూరు ఫౌండేషన్ వహిస్తుందనీ తెలిపారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారికి ఉయ్యూరు ఫౌండేషన్ తరపున సంతాపం తెలియజేస్తూ.. ఒక్కొక్కరికి 20 లక్షల వంతున ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు. గాయపడిన వారి వైద్య ఖర్చులు పూర్తిగా తామే భరిస్తామని స్పష్టం చేశారు.
 
గుంటూరు ఘటనపై గవర్నర్ విచారం

ఈ  ఘటన పై రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని గవర్నర్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.  ఇటీవల కందుకూరులో జరిగిన టీడీపీ రోడ్ షో‌లోనూ తొక్కిసలాట జరిగింది. నాటి ఘటనలో 8 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు.

click me!