గుంటూరు : చంద్రబాబు సభలో తొక్కిసలాట... జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలను ఆదుకుంటానన్న సీఎం

By Siva KodatiFirst Published Jan 1, 2023, 9:47 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గుంటూరులో నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటు చేసుకుని ముగ్గురు మరణించిన ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.  

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గుంటూరులో నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటు చేసుకుని ముగ్గురు మరణించగా , పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను కలచివేసిందన్నారు.గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జగన్ అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం హామీ ఇచ్చారు. 

అంతకుముందు తొక్కిసలాట విషయం తెలుసుకున్న ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అధికారులు, పోలీసులను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రచార పిచ్చి కారణంగానే న్యూ ఇయర్ రోజు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చావులన్నింటికీ ఆయనే బాధ్యత వహించాలని విడదల రజనీ డిమాండ్ చేశారు. 

Also REad: చంద్రబాబు ప్రచార పిచ్చికి జనం బలి.. గుంటూరు తొక్కిసలాట ఘటనపై మంత్రి రజనీ

రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది, నిన్న గాక మొన్న కందుకూరులో 8 మంది, ఈరోజు గుంటూరులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిరోజుల నుంచి చంద్రన్న కానుకపై ప్రచారం నిర్వహించారని రజనీ మండిపడ్డారు. వాహనాలను పెట్టి జనాలను తరలించారని ఆమె ఆరోపించారు. మరోవైపు తొక్కిసలాట చోటు చేసుకున్న ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ, కలెక్టర్ పరిశీలించారు. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ.. ఫస్ట్ కౌంటర్ దగ్గరే ప్రమాదం జరిగిందన్నారు. బారికేడ్లు విరగడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని ఎస్పీ తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. 
 

click me!