ఇక ఎపి బిజెపి నేతలకు ఫుల్ మర్యాదలు : బాబుకి యుపి సెగ

Published : Mar 19, 2017, 04:48 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ఇక ఎపి బిజెపి నేతలకు ఫుల్ మర్యాదలు :  బాబుకి యుపి సెగ

సారాంశం

బిజెపి నేతలను నిర్లక్ష్యం చేయవద్దు, అన్ని మర్యాదలు చేయండి, సమన్వయంతో పనిచేయండి, కలసి నడవండి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వరం మారుతూ ఉంది. 

 

ఇక ముందు ఎక్కడ బిజెపి నాయకులను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలని ఆయన పార్టీ నేతలకు మంత్రులకు సూచనలిచ్చినట్లు తెలిసింది.

 

ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు చంద్రబాబు నాయుడిలో బాగా మార్పు తీసుకువచ్చాయని, ఆయన బిజెపి విధానంలో మార్పు వస్తున్నదని బిజెపి నాయకులు చెబుతున్నారు. ఇక పదవుల పంపకంలో కూడా బిజెపిని ఉచిత రీతిని సంతృప్తి పరిచేందుకు చర్యలు మొదలవుతాయని వారు ఆశిస్తున్నారు. 

 

ముఖ్యమంత్రి ఉత్తర ప్రదేశ్ యాత్ర ముగించుకుని వచ్చాక,  బిజెపి ని అన్ని స్థాయిలలో కలుపుకు పోవాలని  ఆయన స్పష్టంగా ప్రకటిస్తారని, చర్యలు కూడా  ప్రారంభిస్తారని బిజెపి నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. రెండు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి జరిపిన సమీక్షలో  బీజేపీ నేతల విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ప్రత్యేక సూచనలు చేశారని ఇది ఆయనలో వస్తున్న మార్పునకు సూచన అని వారు చెబుతున్నారు. ఇకపై బీజేపీ నేతలను నిర్లక్ష్యం చేయవద్దని ప.గో లో  నేతలకు చెప్పి తెలుగుదేశం నాయకులను కూడా ఆశ్చర్యపరిచారు.

 

 ఈ రోజు యూపి ముఖ్యమంత్రి పదవీ స్వీకార ఉత్సవానికి నాయుడు వెళ్లారు.

 

 బిజెపిని తోక పార్టీగా, తమ ఇష్టాను సారం ఇచ్చే సీట్లలో పోటీ చేసే పార్టీయే నని, చివరకు గెలిపించేది కూడా టిడిపియే కదా అనే ధోరణి ముఖ్యమంత్రిలో, ఇతర టిడిపి ప్రముఖులలో ఉండింది.  అయితే, ఉత్తర ప్రదేశ్ ఇలాంటి టిడిపిని ఉలిక్కి పడేలాచేసింది. ‘ఏమో, ఎవరు చూశారు, ఏదో ఒక కారణంతో బిజెపి దూరమయిపోయి, వచ్చేఎన్నికలలో ఒంటరి గా పోటీ చేస్తే... అపుడు ప్రధాని నరేంద్ర మోదీకి కోపమొచ్చి   ఉత్తర ప్రదేశ్ లో తిరిగినట్లు 2019 లో ఆంధ్రప్రదేశ్ లో క్యాంపెయినచేసి ఏదయిన ఉపద్రవం తీసుకువస్తాడేమో,’ అనే భయంతో కూడిన అనుమానం  టిడిపిలో మొదటిసారిగా మొదలయింది. ఇపుడు మోదీకి మిగిలింది, దక్షిణాది మూడు రాష్ట్రాలే... అవి ఆంధ్ర, తమిళనాడు, కేరళ.

 

2014 ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడు  బీజేపీతో కలిసి పనిచేస్తామని , జిల్లా స్థాయిలో కూడా రెండు  పార్టీల నాయకులతో కమిటీలు వేస్తామని చెప్పినా, ఆచరణలో ఎక్కడా బిజెపి నాయకులను  ఏమాత్రం లెక్క చేయలేదు. సోము వీర్రాజు, కన్నా లక్ష్మి నారాయణ,పురందేశ్వరిల తిరుగుబాటు దీన్నుంచి వచ్చిందే. అపుడు చంద్రబాబు  వెంకయ్య సహాయం తీసుకుని వీరి నోరు మూయించారని చెబుతారు. ఇపుడు దక్షిణాది మీద మోదీ కన్నేయడంతో  వెంకయ్య నాయుడు బ్రేకులు వేసినా బండి ఆగదని బిజెపి నాయకులు చెబుతున్నారు.

 

అసెంబ్లీ సమావేశాల తర్వాత కొన్ని నామినేటెడ్ పదవులను  బిజెపికి పంచి ఇస్తారని, రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయ కమిటీలు వేసి,  అపుడపుడు  సమావేశాలు పెట్టి,  ప్రభుత్వ మర్యాదలందించి,   ఎపుడూ అధికారం రుచి చూడని బిజెపినేతలకు ప్రభుత్వ హంగులు చూపించి సంతృప్తి పరిచేందుకు కృషి మొదలవుతుందని వారు అశిస్తున్నారు.

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?