జగన్ కు ఝలక్: కేంద్ర మంత్రి లేఖ, చంద్రబాబుకు ఊరట

By telugu teamFirst Published Jul 14, 2019, 7:58 AM IST
Highlights

పిపిఎల పునఃసమీక్షకు  వైఎస్ జగన్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. పిపిఎలను తిరగదోడడం సరికాదని కేంద్ర మంత్రి తాను రాసిన లేఖతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న పవన, సౌర విద్యుత్‌ ధరల పట్టికలను కూడా జత చేసి పంపారు.

అమరావతి: మాజీ ముఖ్యయమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలను (పిపిఎలను) తిరగదోడాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఉత్సాహంపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ నీళ్లు చల్లారు. పిపిఎలను తిరగదోడడం సరి కాదని గతంలో ఈ అంశంపై కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన విషయం తెలిసిందే. 

తాజాగా కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ పంపించారు.  పిపిఎల పునఃసమీక్షకు  వైఎస్ జగన్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. పిపిఎలను తిరగదోడడం సరికాదని కేంద్ర మంత్రి తాను రాసిన లేఖతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న పవన, సౌర విద్యుత్‌ ధరల పట్టికలను కూడా జత చేసి పంపారు.

ఇటీవలి ఎన్నికల్లో మీరు సాధించిన ఘన విజయానికి మా అభినందనలని, మీ విజయం తమకు ఆనందదాయకమని, మీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ వేగవంతమైన అభివృద్ధి సాధించాలని, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని ఆశిస్తున్నామని అంటూనే కేంద్ర మంత్రి విద్యుత్‌, పునరుత్పాదక ఇంధన రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు అవినీతిపై జగన్ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని కూడా చెప్పారు అవినీతి ఎక్కడ చోటు చేసుకున్నా కచ్చితంగా దానిపై చర్యలు ఉండాల్సిందేనని అన్నారు. 

అదే సమయంలో మన చర్యలు, ప్రయత్నాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా చట్టానికి లోబడి ఉండాలని, అలా లేకపోతే పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధి రెండూ దెబ్బ తింటాయని కేంద్ర మంత్రి తన లేఖలో అన్నారు. మన దేశంలో పునరుత్పాదక ఇంధన రంగం భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోందని, ప్రపంచంలోని దాదాపు అన్ని పెద్ద పింఛను ఫండ్లు మన దేశంలో ఈ రంగంలోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయని అన్నారు. దేశంలో వేగవంతమైన అభివృద్ధి ప్రదర్శిస్తున్న రంగాల్లో పునరుత్పాదక ఇంధనం ఒకటి అని చెప్పారు. 

ఇక్కడ చట్టం పని చేయడం లేదని, కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించడం లేదన్న అభిప్రాయం బయటకు వెళ్తే పెట్టుబడులు ఆగిపోయి అభివృద్ధి నిలిచిపోతుందని అన్నారు. విద్యుత్‌ టారిఫ్ లను స్వతంత్రంగా పనిచేసే రెగ్యులేటరీ కమిషన్లు నిర్ణయిస్తాయని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో దీని కోసం వేర్వేరు రెగ్యులేటరీ కమిషన్లు ఉన్నాయనిస, ఇవి బహిరంగ విచారణలు నిర్వహించి.. ఖర్చును పరిశీలించి విద్యుత్‌ ధరలను నిర్ణయిస్తాయని గుర్తు చేశారు.. ఒకసారి పీపీఏలు కుదుర్చుకున్న తర్వాత వాటిపై సంతకాలు చేసిన వారంతా దానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. 
 
వాటిని గౌరవించకపోతే ఇకపై పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారని, పీపీఏలన్నీ రద్దు చేయాలనుకోవడం తప్పే గాక చట్ట విరుద్ధం కూడా అని కేంద్ర మంత్రి చెప్పారు. ఏదైనా ఒక ఒప్పందంలో అవినీతి జరిగినట్లు నిర్దిష్టమైన ఆధారాలు, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటే దానిపై విచారణ చేయడంలో తప్పు లేదని, అలా ఏదైనా ఒక ఒప్పందంలో అవినీతి వ్యవహారం చోటు చేసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమైతే సదరు ఒప్పందాన్ని మాత్రమే రద్దు చేసి దానిపై విచారణ చేపట్టవచ్చునని ఆయన జగన్ కు సూచించారు. 

కానీ మూకుమ్మడిగా పీపీఏలను రద్దు చేసి, వాటిపై విచారణ జరపాలనే ప్రయత్నం సరికాదని అన్నారు.  పవన, సౌర విద్యుత్‌ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయని, ఆయా రాష్ట్రాల్లో ఎండ వల్ల చోటు చేసుకొనే రేడియేషన్‌, గాలి వేగం... వీచే సమయం ఆధారంగా ఈ ధరలు నిర్ణయమవుతాయని అన్నారు. గత కొన్నేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో ఈ ధరలు ఎలా నిర్ణయం అవుతూ వస్తున్నాయో తాను కొన్ని పట్టికలను కూడా దీనికి జత చేసి పంపుతున్నానని చెప్పారు. 

"వీటిని చూస్తే గత ప్రభుత్వ హయాంలో మీ రాష్ట్రంలో కుదుర్చుకున్న పీపీఏల్లో విద్యుత్‌ ధరలు సమంజసంగా ఉన్నదీ లేనిదీ మీకు తెలిసిపోతుంది. ఈ సమాచారం ఆధారంగా మీరు మీ పరిశీలన జరుపుతారని ఆశిస్తున్నాను. పునరుత్పాదక రంగంలోకి పెట్టుబడులు కొనసాగడం పర్యావరణానికి, విద్యుత్‌ రంగానికి అవసరం" అని కేంద్ర మంత్రి అన్నారు.

click me!