
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ ఆస్పత్రిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం సందర్శించారు. ఈ హాస్పిటల్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక్కడ నిరుపేద చిన్న పిల్లలకు ఉచితంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడం అభినందనీయం అని ప్రశంసించారు.
శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయను సందర్శించిన సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఇక్కడ మాట్లాడారు. గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు చాలా ఖర్చులతో కూడుకున్న వ్యవహారం అని వివరించారు. అవి కూడా చెన్నై, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని అన్నారు. అయితే, శ్రీపద్మాలయ తిరుపతిలో నిరుపేదలకు విశేష సేవలు అందిస్తున్నదని తెలిపారు.
Also Read: కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులకు కొదవలేదు.. ఎన్నికలకు ముందు ప్రకటించం: మాణిక్‌రావు ఠాక్రే స్పష్టీకరణ
ఈ హాస్పిటల్‌లో ఇప్పటి వరకు సుమారు 1600 గుండె సంబంధ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించారని, ఇది కచ్చితంగా భగవంతుని సేవే అవుతుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ గొప్ప కార్యాన్ని చేపడుతున్న టీటీడీ యాజమాన్యం, ఆస్పత్రి డాక్టర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మీడియాతో మాట్లాడటానికి ముందు ఆయన హాస్పిటల్‌లోని ఐసీయూ, ఔట్ పేషెంట్ సెక్షన్, ఆపరేషన్ థియేటర్లు, ఇతర వార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ భరత్, తదితరులు పాల్గొన్నారు.