
గుంటూరు జిల్లా (guntur district) మంగళగిరిలోని ఎయిమ్స్ (aiims mangalagiri) అధికారులకు క్లాస్ పీకారు కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ (bharati pravin pawar). ఎయిమ్స్‌లో వైద్య సేవలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఓపీ సేవలు సరిగ్గా లేవన్న ఫిర్యాదులపై ఫైరయ్యారు. ప్రతిరోజూ తానే వచ్చి గంట పాటు ఓపీ చూడాలా అంటూ ప్రశ్నించారు. ల్యాబ్ రిపోర్ట్‌లు ఎంత సేపటిలో అందిస్తున్నారని.. కేంద్ర మంత్రి ప్రశ్నించగా.. గంటలో అందిస్తున్నారని చెప్పారు. అయితే తనకున్న సమాచారం ప్రకారం రిపోర్ట్‌లు ఇవ్వడానికి ఒక రోజు తీసుకుంటున్నారని .. త్వరగా ఇవ్వాలని ఆమె ఆదేశించారు.
ఆసుపత్రిలో రక్షిత మంచినీటి సమస్య వుందని.. టెండర్లు రావడం లేదని అధికారులు వివరించారు. అయితే ఇంత పెద్ద భవనాలు కట్టడానికి టెండర్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు రావడం లేదని ఫైరయ్యారు . రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి నీటి సమస్య తీసుకెళ్లారా అని ప్రశ్నించారు. సీఎం సమస్యను పరిష్కరించేందుకు హామీ ఇచ్చారని చెప్పారు అధికారులు. ఎయిమ్స్‌లో ఖాళీలను భర్తీ చేయాలని అధికారులు కోరగా.. దీనిపై కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని భారతి ప్రశ్నించారు. కోట్ల రూపాయల నిధులు ఇచ్చినా ఆసుపత్రి నిర్వహణ ఇలా చేస్తారా అంటూ అధికారులపై మండిపడ్డారు. ప్రధాని మోడీ ఒక్కరే పనిచేస్తే సరిపోదని.. అందరూ పనిచేయాలని కోరారు భారతి ప్రవీణ్.