విభజన సమస్యలపై ముగిసిన కేంద్ర హోం శాఖ సమావేశం.. ఎలాంటి పురోగతి లేకుండానే..?

By Sumanth KanukulaFirst Published Sep 27, 2022, 1:55 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014కి సంబంధించిన అపరిష్కృత సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ ‌అధికారులతో కీలక సమావేశం నిర్వహించింది. 

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014కి సంబంధించిన అపరిష్కృత సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ ‌అధికారులతో కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. రెండు గంటలకు పైగా సాగిన సమావేశం.. ఎటువంటి పురోగతి లేకుండానే ముగిసినట్టుగా తెలుస్తోంది. ఉభయ రాష్ట్రాల మధ్య వివాదాలపైనా సమావేశంలో చర్చ సాగింది. అయితే విద్యుత్‌ బకాయిల అంశం చర్చకు రాలేదని సమాచారం. ఈ సమావేశంలో సమస్యల పరిష్కారానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలుస్తోంది. 

ఇక, ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మతో పాటు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  14 అంశాలను ఇవాళ్టి సమావేశం ఎజెండాలో చేర్చారు. ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు చెందినవి. మరో ఏడు అంశాలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి.

కంపెనీలు, కార్పొరేషన్ల విభజన, రాష్ట్ర సంస్థల విభజన, చట్టంలో ఎక్కడా పేర్కొనని సంస్థల విభజన, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌, ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్  విభజన వంటి ఏడు ముఖ్యమైన అంశాలు సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇక, ఈ సమావేశం ఎజెండాలో.. పన్ను ప్రోత్సాహకాలు, ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి గ్రాంట్,  కొత్త రాజధాని నగరం ఏర్పాటు, విద్యాసంస్థల ఏర్పాటు, కొత్త రాజధాని నుంచి త్వరితగతిన రైలు కనెక్టివిటీ ఏర్పాటుకు కేంద్ర మద్దతు అంశాలు కూడా ఉన్నాయి. 

ఇదిలా ఉంటే.. విభజన చట్టానికి చెందిన సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే 25 సమావేశాలు జరిగాయి.ఈ ఏడాది మూడు దఫాలు సమావేశాలు నిర్వహించారు. ఇవాళ్టి సమావేశం నాలుగోది.  

click me!