ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతో మనస్తాపంతో అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వైఎస్ జగన్ హీరో అంటూ పొగిడారు.
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నా దృష్టిలో హీరో అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి సంస్కారవంతుడు కాబట్టే తెలుగు గంగ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టారని తెలిపారు. సోనియా గాంధీ కేంద్ర మంత్రిని చేస్తానన్నప్పటికీ జగన్ ఓదార్పు యాత్ర చేసి ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు.
‘నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ 151 సీట్లు సాధించిన జగన్ ను నేను ఎందుకు తిట్టాలి?.. జగన్ ను తిట్టి వేరే పార్టీ వాళ్లను పొగడాలా? ఆయన సీఎం అయ్యాక నన్ను గౌరవించారు. అడగకుండానే చైర్మన్ ను చేశారు. జగన్ కచ్చితంగా హీరోనే. ఆనాడు ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే, అందుకు నేను ప్రత్యక్ష సాక్షిని. బాబు హయాంలో గన్నవరం ఎయిర్ పోర్లుకు ఎన్టీఆర్ పేరెందుకు పెట్టలేదు?’ అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రశ్నించారు.
undefined
‘నా రాజీనామా విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నేను స్వరం మార్చలేదు. నాపై విమర్శలు చేసేవారికి ఫోన్ల ద్వారా వివరణ ఇస్తున్నా. యూనివర్సిటీ పేరు మార్పుపై లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు తన సొంత అభిప్రాయం’ అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై సెప్టెంబర్ 21న ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ మనస్తాపం చెందారు. తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సరికాదని చెప్పారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం అంత సరైన నిర్ణయం కాదని అన్నారు. దీంతో మనస్తాపంతోనే తాను రాజీనామా చేస్తున్నానన్నారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తానని అప్పటి ప్రధాని వాజ్‌పేయి చెబితే చంద్రబాబు నాయుడు వద్దన్నారని చెప్పుకొచ్చారు. క్రెడిట్ లక్ష్మీ పార్వతికి వస్తుందని ఆనాడు చంద్రబాబు దీనికి ఒప్పుకోలేదని తెలిపారు. మరోవైపు ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై వైసీపీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అభ్యంతరం వ్యక్తం చేశారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని తెలిపారు. ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చారిత్రాత్మకమని.. అలాగే హెల్త్ యూనివర్సిటీ పేరును కూడా కొనసాగించాలని అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మారుస్తూ అసెంబ్లీలో జగన్ సర్కార్ తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.