
న్యూఢిల్లీ: విభజన హమీలను కేంద్రం తప్పకుండా అమలు చేస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.విభజన హమీలను అమలు చేయకపోతే ఏ పార్టీ కూడ వచ్చే ఎన్నికల్లో గెలవదని ఆయన స్పష్టం చెప్పారు. ప్రత్యేకహోదాతో సమానమైన నిధులు ఇస్తున్నందున ఏపీకి ప్రత్యేక హోదా అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
మంగళవారం నాడు ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టం తదితర అంశాలపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానమిచ్చారు. ఏపీ విభజన హమీ చట్టంలోని 90 శాతం హమీలను అమలు చేసినట్టు ఆయన చెప్పారు. గత ప్రధాని, ప్రస్తుత ప్రధాని హమీలను అమలు చేస్తామని రాజ్యసభలో రాజ్‌నాథ్ ప్రకటించారు.
అన్ని రాష్ట్రాల అభివృద్ధిని తాము కోరుకొంటామని కేంద్ర మంత్రి ప్రకటించారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదని చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనను కేంద్ర మంత్రి సభలో ఉటంకించారు. కడపలో స్టీల్ ఫ్లాంట్, దుగ్గరాజుపట్నంలో పోర్టు ఏర్పాటు విషయాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు కోసం కమిటీ వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిందన్నారు. అయినా కేంద్రం ఈ విషయమై సానుకూలంగా పరిశీలిస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటించారు.
పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకొన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఏపీ అభివృద్ధికి ఇంత కంటే తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పోలవరం కోసం ఇప్పటికే రూ.6757 కోట్లను ఖర్చు చేసినట్టు చెప్పారు. రికార్డు సమయంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.
అమరావతి నిర్మాణం కోసం రూ.1500 కోట్లను ఖర్చు చేసిన విషయాన్ని ఆయన సభలో ప్రకటించారు. 11 సంస్థలకు గాను 10 సంస్థలను ఏపీలో ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. అధికారం కోసం కాదు.. అభివృద్ధి కోసం రాజకీయం చేస్తామని రాజ్‌నాథ్ చెప్పారు.
ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చింది. రాజకీయ పార్టీగా టీడీపీ ఏ నిర్ణయమైనా తీసుకొనే అధికారం ఉందన్నారు. విభజన హమీలను అమలు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులను ఇస్తోన్నందున హోదా అవసరమే ఉండదన్నారు. విశాఖలో రైల్వేజోన్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.