ఏపీ సీఎం వైఎస్ జగన్ సర్కార్ మీద కేంద్రం దెబ్బ

By telugu team  |  First Published Jul 30, 2020, 6:51 AM IST

పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలనే వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వ విధానం దెబ్బ పడే అవకాశం ఉంది. ఐదో తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలని కేంద్రం ప్రకటించింది.


అమరావతి: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త విద్యావిధానం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై పెద్ద దెబ్బనే వేసింది. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే వైఎస్ జగన్ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం విధానం విఘాతం కలిగించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం దాదాపు 34 ఏళ్ల తర్వాత కొత్త విద్యావిధానాన్ని తీసుకొచ్చింది.

5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని కేంద్రం నిర్ణయించింది. వీలైతే 8వ తరగతి వరకు కూడా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని చెప్పింది. తెలుగు మీడియం ఆప్షన్ లేకుండా ఇంగ్లీష్ మీడియంను పాఠశాలల్లో ప్రవేశపెట్టాలనే జగన్ నిర్ణయానికి అది ఆటంకం కలిగించే అవకాశం ఉంది. 

Latest Videos

undefined

కేంద్రం తెచ్చిన జాతీయ విద్యావిధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాటించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలనే జగన్ నిర్ణయానికి అది విఘాతం కలిగిస్తుందని అంటున్నారు. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 81,85 జీవోలను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 

రాష్ట్రంలోని 80 శాతానికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియాన్ని కోరుకుంటున్నారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

click me!