
వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు కొనసాగుతునే ఉన్నాయి. శుక్రవారం రాత్రి కడపజిల్లా పులివెందులలో వైసీపీ నేతపై గుర్తుతెలీని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పులివెందులకు చెందిన చిన్నపురెడ్డి శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో రాఘవేంద్రహాలు నుండి తన ఇంటికి వెళుతుండగా కూరగాయల మార్కెట్ వద్ద కొందరు దారికాచి మరీ దాడిచేసారు. వేటకొడవళ్ళతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. చిన్నపురెడ్డి తల, మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. రెండు చేతివేళ్ళు తెగిపడిపోయాయి.
దాడి విషయం గమనించిన స్ధానికులు పెద్దగా కేకలు వేస్తూ ఘటనా స్ధలానికి చేరుకోవటంతో వెంటనే దాడిచేసిన వారు పారిపోయారు. అపస్మారకంలో పడిపోయిన బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే కడప ఎంపి అవినాష్ రెడ్డితో పాటు పార్టీ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. వెంటనే కడపలోని ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం బాధితుడిని హైదరాబాద్ కు తరలించారు.