
తమిళనాడు రాజకీయాలు విచిత్రంగా సా.........గుతున్నాయి. పార్టీలో పన్నీర్ సెల్వం, శశికళ, పళనిస్వామిల స్ధానాలేమిటో, వారికున్న అధికారాలేమిటో కూడా జనాలకు అర్ధం కావటం లేదు. ఒకరిని మరొకరు సస్పెండ్ చేస్తున్నారు. మరొకరు ఇంకోరిని బహిష్కరిస్తున్నారు. ఒకరు సస్పెండ్ చేసినా, మరొకరు బహిష్కరించినా అందుకు వారికి సరైన అధికారాలున్నాయా అన్నదే అనుమానం. జయలలిత మరణం తర్వాత ఏఐఏడిఎంకె పార్టీలో ఈ స్ధాయిలో ఇంత తొందరగా ముసలం పుడుతుందని ఎవరూ ఊహించలేదేమో.
స్వయంగా జయలలితే ఏరికోరి నియమించిన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను జయ నెచ్చెలి శశికళ తొలగించటమేమిటి? ఆమె తొలగించటమే తప్పనుకుంటే, పన్నీర్ సెల్వం మాట మాట్లాడకుండా రాజీనామా సమర్పించటం విచిత్రం. తనకు అర్హత లేకున్నా శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అదికూడా ఏకగీవ్రంగా.ఇక, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కొద్ది రోజులకే పార్టీ శాసనసభాపక్ష నేతగా కూడా ఎన్నికవ్వటం మరింత విచిత్రం. అసలు, ప్రధాన కార్యదర్శిగానే నియమితలయ్యేందుకు అవకాశం లేని శశికళను ఏకంగా శాసనసభాపక్ష నేతగా ఎలా ఎన్నుకున్నారో ఎంఎల్ఏలకే తెలియాలి.
అన్నింటికన్నా విచిత్రమేమిటంటే, శశికళను శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదించిందే పన్నీర్ సెల్వం. పార్టీలో ఒంటరైపోయిన పన్నీర్ శశికళను ఆపే శక్తిలేని కారణంగానే అన్నింటినీ చూస్తూ మౌనంగా భరించారు. తప్పని పరిస్ధితుల్లో ముఖ్యమంత్రిగా కూడా రాజీనామా చేసేసారు. ఆపద్ధర్మ సిఎంగా మిగిలిపోయిన పన్నీర్ ఒకరోజు రాత్రి మెరీనాబీచ్ లోని జయలలిత సమాధి వద్దకు వెళ్ళి మౌనదీక్ష చేసిన తర్వాత ఒక్కసారిగా జూలు విధిల్చారు. అందరూ ఆశ్చర్యపడేట్లుగా చిన్నమ్మపైకి తిరగబడ్డారు. అందుకు కారణం కేంద్రమేనన్న విషయం అందరికీ అర్ధమైపోయింది.
శశికళ సిఎం కావటాన్ని జీర్ణించుకోలేని కేంద్రప్రభుత్వం తెరవెనుక నుండి చక్రం తిప్పింది. దాంతో అటు గవర్నర్, ఇటు పన్నీర్ చక్కటి అవగాహనతో ఆట మొదలుపెట్టారు. దాంతో శశికళ డిఫెన్స్ లో పడిపోయారు. అప్పటి నుండి రాజకీయం గంటకో మలుపు తిరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా.పార్టీ ప్రధానకార్యదర్శిగా ఎన్నికైన శశికళకు పార్టీ రాజ్యాంగం ప్రకారం అర్హత లేదు. అయినా ఎన్నికయ్యారు. అందుకు ఎన్నికల సంఘం అంగీకరించలేదు. ఇదిలావుండగానే శాసనసభాపక్ష నేతగా కూడా ఎన్నికయ్యారు. తాజాగా పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎంపికచేసారు. ఇలా అడుగడుగునా పార్టీలో గందరగోళమే కనబడుతోంది. ఎప్పటికి కుదుటపడుతుందో ఏమో.