ఇకపై జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడను...: మాజీ ఎంపీ ఉండవల్లి సంచలనం

Published : Apr 24, 2023, 10:16 AM IST
ఇకపై జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడను...: మాజీ ఎంపీ ఉండవల్లి సంచలనం

సారాంశం

ఆంధ్ర ప్రదేేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇకపై జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడబోనని ఉండవల్లి ప్రకటించారు. 

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంపూర్ణ మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను న్యాయపోరాటానికి దిగితే అందుకు జగన్ మద్దతిచ్చారని... అందువల్లే ఆయనకు వ్యతిరేకంగా ఇకపై మాట్లాడబోనని అన్నారు. అయితే ఇది ఎంతకాలమో చెప్పలేనని... తన ఇష్టానుసారం ఎప్పుడు ఏం మాట్లాడాలో నిర్ణయం తీసుకుంటానని ఉండవల్లి అన్నారు. 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించానని... ఈ విషయంతో ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరినట్లు ఉండవల్లి తెలిపారు. ఈ కేసులో ప్రభుత్వం తరపున ఇంప్లీడ్ కావాలని కోరినా సీఎంగా వున్న చంద్రబాబు స్పందించలేదని అన్నారు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినతర్వాత ఓ ప్రెస్ మీట్ లో రాష్ట్ర ప్రయోజనాల కోసం న్యాయపోరాటం చేస్తున్నానని... ఈ ప్రభుత్వమైనా ఇంప్లీడ్ కావాలని కోరానన్నారు. దీంతో వెంటనే స్పందించిన జగన్ సర్కార్ ఆ కేసులో ఇంప్లీడ్ అవుతూ పిటిషన్ వేసిందని ఉండవల్లి పేర్కొన్నారు. 

తన న్యాయపోరాటానికి ప్రభుత్వ మద్దతు లభించడంతో మరింత బలాన్ని ఇచ్చిందన్నారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను నేరవేర్చేలా చూడాలని తనతో పాటు ప్రభుత్వమూ న్యాయస్థానాలను కోరుతోందన్నారు. తనకు సపోర్ట్ గా నిలిచిన సీఎం జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఉండవల్లి అన్నారు.  

Read More  లోకేష్‌ పాదయాత్రతో ఎవరికి లాభం.. కనీసం సెల్ఫీలు దిగడం లేదు : ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యలు

ఇక మార్గదర్శ చిట్ ఫండ్ అక్రమాలపైనా తాను చేస్తున్న పోరాటానికి కూడా జగన్ ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. మార్గదర్శి అక్రమాలపై సుప్రీంకోర్టులో తాను వేసిన కేసులో వైసిపి ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది... కానీ తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ కాలేదన్నారు. ఎక్కడ కేసీఆర్ కు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఈ కేసులో ఇంప్లీడ్ అవుతుందోనని భయపడి అనుకూల వార్తలు రాస్తున్నారని అన్నారు. అందువల్లే ఆంధ్రప్రదేశ్ లో ఈనాడు పేపర్ కి, తెలంగాణలో పేపర్ కి చాలా తేడా ఉంటుందన్నారు. తెలంగాణ సచివాలయం మయసభ అంటూ కేసీఆర్ సర్కార్ ను ఆకాశానికి ఎత్తుతోందన్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద జాదూ... ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ తెలియదని ఉండవల్లి అన్నారు. ఆయనను ప్రసన్నం చేసుకుని మార్గదర్శి వ్యవహారంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలనిరామోజీ రావు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తన మీడియా సంస్థల ద్వారా ప్రచారం చేస్తున్నారని ఉండవల్లి పేర్కొన్నారు. 

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి ఎప్పట్లాగే రామోజీరావుకు మద్దతిస్తుంది... కాబట్టి మార్గదర్శి వ్యవహారంలో ఆయనకే అనుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు. కానీ జనసేన పార్టీ కూడా ఆయనకు సపోర్ట్ ఇస్తోందని... జగన్ కు వ్యతిరేకంగా వార్తలు రావాలనే మార్గదర్శికి పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచారన్నారు. 

వైస్సార్సీపీ లో వైస్సార్ పేరు ఉంది... కాబట్టి తండ్రి పేరును సార్ధకం చేయాలంటే మార్గదర్శి కేసులో జగన్ వెనక్కి వెళ్లకూడదని అన్నారు.ఏమాత్రం స్పీడ్ తగ్గించకుండా ముందుకు వెళ్లాలని ఉండవల్లి కోరారు. ప్రస్తుతానికి మార్గదర్శి అక్రమాలను బయటపెట్టే విషయంలో జగన్ సర్కార్ సక్రమంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ప్రయత్నించారు... కాబట్టి తండ్రి ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత సీఎం జగన్ పై వుందని ఉండవల్లి అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Minister Kolusu Parthasarathy serious on Bhumana Karunakar Reddy | TDP VS YCP | Asianet News Telugu
విజయవాడ సంక్రాంతి వేడుకల్లో MP Kesineni Sivanath | Sankranthi Muggulu | Asianet News Telugu