పెంచిన జీతాలు వ‌ద్దంటూ స‌మ్మెకు దిగ‌డం తొలిసారి కావొచ్చు.. ఉద్యోగ సంఘాలకు ఉండవల్లి అరుణ్‌కుమార్ లేఖ

By Sumanth KanukulaFirst Published Jan 24, 2022, 3:34 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Prdesh) ఇటీవల విడుదల పీఆర్సీ జీవోలను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక లేఖ రాశారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Prdesh) ఇటీవల విడుదల పీఆర్సీ జీవోలను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. PRC ఉత్తర్వులు రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని పీఆర్సీ సాధన సమితి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ఒక లేఖ రాశారు. ఒక పక్క కరోనా బీభత్సం, మరో పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక‌ దుస్థితిని దృష్టిలో పెట్టుకుని సమ్మెను ఆపాలని ఉండవల్లి అరుణ్‌కుమార్ ఉద్యోగ సంఘాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

కొత్త పీఆర్సీ అమ‌లు చేయ‌డం వ‌ల్ల రూ.10,247 కోట్ల అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని ఏపీ స‌ర్కారు చెబుతోందని ఉండవల్లి అరుణ్‌కుమార్ గుర్తుచేశారు. అయితే త‌మ‌కు చిన్న‌ మొత్తంలో పెంచిన జీతాలు వ‌ద్దంటూ ఉద్యోగ సంఘాలు స‌మ్మెకు దిగుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. సాధార‌ణంగా జీతాలు పెంచాల‌ని ఉద్యోగులు స‌మ్మెల‌కు దిగడం తాను చూశాన‌ని.. పెంచిన జీతాలు వ‌ద్దంటూ స‌మ్మెకు దిగ‌డం ఇదే ప్ర‌థ‌మం అయి ఉండొచ్చ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఈ పరిస్థితులలో స‌మ్మెను ఆపాల‌ని ఆయ‌న ఉద్యోగ సంఘాలను కోరారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పట్టింపులకు పోకుండా చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం సాధించాలని కోరుతున్నానని ఉండవల్లి పేర్కొన్నారు.

ఇక, పీఆర్సీ వివాదం నేపథ్యంలో.. ఉద్యోగ సంఘాలతో సంప్రదింపుల కోసం మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, పేర్నినాని (Perni Nani), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మలతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చర్చలకు హాజరుకావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పంపింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చింది. ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ఉద్యోగ సంఘాలను ఆహ్వానించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ ఢిల్లీపర్యటనలో ఉన్నందున కమిటీలోని మిగిలిన ముగ్గురూ ఉద్యోగులతో సంప్రదింపులకు అందుబాటులో ఉంటామని సమాచారం ఇచ్చారు. 

అయితే ఈ ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. మంత్రలు సచివాలయంలో రెండో బ్లాక్‌లో ఉద్యోగ సంఘాల రాక కోసం మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల వేచిచూశారు. అయితే దాదాపు మూడు గంటల పాటు ఉద్యోగుల కోసం ఎదురచూశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. పీఆర్సీపై అనుమానాలు ఉంటే ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడగొచ్చని సజ్జల అన్నారు. అందుకోసమే ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. 

click me!