తల్లి అనుమానాస్పద మృతి, తండ్రి హత్య.. తాతయ్య జైలుకి: అనాథలైన ఇద్దరు చిన్నారులు

By Siva KodatiFirst Published Aug 11, 2020, 4:08 PM IST
Highlights

పది నెలల క్రితం తల్లి ఆత్మహత్య చేసుకోగా.. మద్యానికి బానిసైన తండ్రి హత్యకు గురయ్యాడు, ఇప్పటి వరకు అన్నీ తానై సాకిన తాతయ్య జైలు పాలయ్యాడు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇలా జరగడంతో ఇద్దరి పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

పది నెలల క్రితం తల్లి ఆత్మహత్య చేసుకోగా.. మద్యానికి బానిసైన తండ్రి హత్యకు గురయ్యాడు, ఇప్పటి వరకు అన్నీ తానై సాకిన తాతయ్య జైలు పాలయ్యాడు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇలా జరగడంతో ఇద్దరి పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా డీజే పురం గ్రామానికి చెందిన పల్లా సత్యనారాయణ, రమణమ్మ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో పెద్ద కుమార్తె పావనికి శంఖవరం మండలం గొంది అచ్చంపేటకు చెందిన పంపనబోయిన లక్ష్మణరావుతో 2015లో వివాహం జరిగింది.

వీరికి నాలుగేళ్ల శివసింధు, రెండేళ్ల కావ్యశ్రీ సంతానం. ఈ క్రమంలో తాగుడికి బానిసైన భర్త వేధింపులు తాళలేక పావని పదినెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో లక్ష్మణరావు తన పిల్లలను అత్తవారింటికి పంపించేశాడు.

అప్పటి నుంచి చిన్నారులు తాతయ్య, అమ్మమ్మ దగ్గరే పెరుగుతున్నారు. కుమార్తె మరణంపై తొలి నుంచి అల్లుడిపైనే సత్యనారాయణ, రమణమ్య అనుమానం వ్యక్తం చేసేవారు. ఈ నేపథ్యంలో శనివారం అచ్చంపేట వెళ్లిన సత్యనారాయణ తన అల్లుడిని తీసుకుని వచ్చాడు. రాత్రి మద్యం మత్తులో ఉన్న అల్లుడితో పిల్లలను తమ వద్దకు ఎందుకు పంపించేశావని ప్రశ్నించారు.

ఈ సమయంలో ఒళ్లు తెలియని మైకంలో ఉన్న లక్ష్మణరావు.. తనకు మరో పెళ్లి చెయ్యాలని, లేకుంటే పిల్లలను కూడా నీ కూతురిని చంపినట్లే చంపేస్తానని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన సత్యనారాయణ పక్కనే ఉన్న కత్తితో అల్లుడిని హత్య చేశాడు. అనంతరం మొండెం నుంచి తలను వేరు చేశాడు.

మరుసటి రోజు ఉదయం అతని తలను సంచిలో వేసుకుని వెళ్లి అన్నవరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. తల్లిదండ్రులిద్దరూ లేకపోవడం, తాతయ్య సైతం హత్య కేసులో జైలుకు వెళ్లడంతో ఇప్పుడు పిల్లల బాధ్యత రమణమ్మ పైన పడింది. దీంతో ఏం చేయాలో తెలియక ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. 

click me!