విషాదం : భర్త మరణాన్ని తట్టుకోలేక.. 24 గంటల్లో భార్య మృతి...

By Bukka SumabalaFirst Published Aug 30, 2022, 8:40 AM IST
Highlights

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భర్త మృతి తట్టుకోలేక ఓ భార్య 24 గంటలు గడవకముందే తుదిశ్వాస విడిచింది. 

సోంపేట : జీవితాంతం కలిసి తోడూనీడగా ఉంటానని ప్రమాణాలు చేసిన భార్యభర్తలు ఒకరిని విడిచి మరొకరు వెళ్లిపోతే తట్టుకోవడం కష్టమే.. అలా జీవిత భాగస్వామి మరణాన్ని తట్టుకోలేక తాము కూడా చనిపోయే ఘటనలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. అలాంటి ఘటనే ఇది.. భర్త మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. 24 గంటలైనా గడవక ముందే కట్టుకున్న వారిని వెతుక్కుంటూ వెళ్లి పోయింది.  

బంధువుల కథనం ప్రకారం.. సిరిమామిడి పంచాయతీ తోటూరు గ్రామానికి చెందిన సుందర రావు (55) భార్యతో కలిసి ఉపాధి నిత్య బిలాయి లో ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అతను  అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ దిగులుతో భార్య పుణ్యవతి (48) సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. భార్యభర్తల మృతితో  కుటుంబంలో విషాదం నెలకొంది. వీరికి ఇద్దరు కుమారులు.

పెద్ద కుమారుడికి వివాహం అయ్యింది. కాగా, చిన్నకొడుకుకు ఈ నెల 20న  పెళ్లి చేయాలని నిర్ణయించారు. అనివార్య కారణాలతో ఆ పెళ్లి వాయిదా వేశారు. సుందరరావు వాడ బలిజ సంక్షేమ సంఘం, జాతీయ సంఘం వ్యవస్థాపక సభ్యునిగా, తోటూరు అరుణోదయ సంఘం అధ్యక్షునిగా సేవలందిస్తున్నారు. బిలాయ్ కుర్సీపార్ ఇందిరా గాంధీ విద్యాలయం ఉపాధ్యాయునిగా తెలుగు చదువులకు  సేవలు అందిస్తూ.. బిలాయ్ ఆంధ్రుల ఐకమత్యానికి కృషి చేశారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి సూర చంద్రమోహన్ తో పాటు ఎర్రముక్కాం, తోటూరు గ్రామ ప్రతినిధులు, ఇతర ఇతర ప్రముఖులు బిలాయ్ వెళ్లి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

గోరంట్ల మాధవ్ వ్యవహారం : స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం.. ఎంపీపై చర్యలకు సూచన...

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో జరిగింది. ఆగస్ట్ 27న మధ్యప్రదేశ్లోని డిండౌరీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యపై ప్రేమతో ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చి పెట్టుకున్నాడు. అంత్యక్రియలు పూర్తి చేశాడు. డిండౌరీలోని వార్డ్ నెంబర్ 14 లో నివాసముంటున్న ఓంకార్ దాస్ స్థానికంగా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈయనకు పాతికేళ్ల క్రితం రుక్మిణి అనే మహిళతో వివాహం అయింది. సంతానం లేకున్నా.. భార్య భర్తలు అన్యోన్యంగా జీవించేవారు. రుక్మిణి అనారోగ్యంతో ఆగస్టు 23న మృతి చెందింది. 

ఆ బాధను తట్టుకోలేక పోయిన ఓంకార్ దాస్..  ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. ఈ విషయం తెలిసి భయాందోళనకు గురైన ఇరుగుపొరుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కలెక్టరేట్ కు చేరుకుని ఎస్డీఎం బల్వీర్ రామన్ కు ఫిర్యాదు చేశారు. ఎస్డీఎం ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ గోవింద రామే పోలీసులతో కలిసి ఉపాధ్యాయుడు ఇంటికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికి తీసి నర్మదా నది ఒడ్డున పాతిపెట్టారు. దీంతో ఇరుగుపొరుగు ఊపిరి పీల్చుకున్నారు. 

click me!