ఏలూరులో ఘోరం... తాటిచెట్టు విరిగిపడి రెండేళ్ల చిన్నారి దుర్మరణం (వీడియో)

By Arun Kumar PFirst Published Mar 23, 2023, 9:52 AM IST
Highlights

ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు స‌ృష్టిస్తున్నారు. ఇలా ఏలూరు జిల్లాలో ఈదురుగాలులకు తాటిచెట్లు విరిగిపడి ఓ చిన్నారి దుర్మరణం చెందింది. 

ఏలూరు : అప్పటివరకు ముద్దుముద్దు మాటలతో అల్లరిచేసిన చిన్నారి ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయింది. ప్రయాణికులతో వెళుతున్న ఆటోపై రోడ్డుపక్కన చెట్టు విరిగిపడటంతో ముక్కుపచ్చలారని రెండేళ్ల చిన్నారి దుర్మరణం చెందింది. ఆటో డ్రైవర్ తో పాటు మరో ఐదుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

నూజివీడు మండలం మర్రిబంధం గ్రామ సమీపంలో రోడ్డుపక్కన భారీ తాటిచెట్లు వున్నాయి. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలులకు ఈ చెట్లు ప్రమాదకరంగా మారాయి. భూమిలోకి చొచ్చుకుపోయిన వేర్లు బలహీనపడటంతో ఓ చెట్టు విరిగి చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. 

ఓ రెండేళ్ల చిన్నారితో పాటు ఐదుగురు మహిళలు ప్రయాణిస్తున్న ఆటోపై ఒక్కసారిగా తాటిచెట్టు కుప్పకూలింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా చెట్టు విరిగిపడి ఈ ఘోర ప్రమాదాన్ని సృష్టించింది. ఆటోలోని చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఐదుగురు మహిళలు తీవ్ర గాయాలపాలయ్యారు. 

వీడియో

మహిళల ఆర్తనాదాలు విన్న స్థానికులు వారిని ఆటోలోంచి బయటకు తీసి 108 అంబులెన్స్ లో నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో రోడ్డుపై పడ్డ చెట్టును, ధ్వంసమైన ఆటోను రోడ్డుపై నుండి  పక్కకు తొలగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు ఇలా హటాత్తుగా మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన మహిళల కుటుంబసభ్యులు కూడా హాస్పిటల్ వద్దకు చేరుకుని తమవారిని పరామర్శిస్తున్నారు. ఈ కాలంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలతో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. 

click me!