కర్నూలు జిల్లాలో వజ్రాల వేట: మరో రెండు విలువైన వజ్రాలు లభ్యం

By telugu teamFirst Published May 29, 2021, 10:03 AM IST
Highlights

ఏపీలోని కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతోంది. తాజాగా మరో రెండు విలువైన వజ్రాలు రైతులకు లభించాయి. వాటిని వేల ధర పెట్టి వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో వజ్రాల వేట ప్రారంభమైంది. గత మూడు రోజుల వ్యవధిలో మూడు విలువైన వజ్రాలు రైతులకు దొరికాయి. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరిలో తాజాగా మరో రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. 

బొప్పాయి తోటలో కలుపు తొలగిస్తున్న మహిళా కూలీకి ఓ వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ.70 వేలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న మరో మహిళా కూలీకి ఓ వజ్రం లభించింది. దాన్ని పెరవలికి చెందిన వ్యాపారికి రూ.40 వేలకు అమ్మినట్లు తెలుస్తోంది.

ఇటీవల చిన్నజొన్నగిరిలో ఓ రైతుకు విలువైన వజ్రం దొరికింది. పొలంలో పనిచేస్తున్న రైతుకు ఆ వజ్రం దొరికింది. దాన్ని కోటీ 25 లక్షల రూపాయలకు గుత్తికి చెందిన వ్యాపారి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. 

కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, జీ ఎర్రగుడి, పెరవలి ప్రాంతాల్లో వజ్రాలు లభ్యమవుతున్నట్లు తెలుస్తోంది.  వర్షాలు కురిసిన తర్వాత పొలాల్లో ఈ వజ్రాలు లభ్యమవుతున్నట్లు తెలుస్తోంది. వజ్రాల కోసం ఇంతకు ముందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తవ్వకాలు జరిపేవారు. ప్రస్తుతం స్థానికులే ఆ పనిచేస్తున్నారు. 

click me!